
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వదలడం లేదు. మనీలాండరింగ్ కేసు విచారణలో ఆమెపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ED సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమీక్షించే ప్రక్రియను ఏజెన్సీ ప్రారంభించింది.
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ తో ఆమెకు సంబంధం ఉన్నట్ఉట ఈడీ ఆరోపించింది. ఇప్పటికే ఈడీ పలుసార్లు ఆమెను విచారించింది. ఆమె గత ఏప్రిల్‌లో ఏజెన్సీ ముందు హజరైన సందర్భంలో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో ఫెర్నాండెజ్ యొక్క రూ. 7.12 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను, రూ. 15 లక్షల నగదును "క్రైమ్ ఆఫ్ క్రైమ్" గా అటాచ్ చేసింది.
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఖైదీగా ఉన్న చంద్రశేఖర్ .. ఆమెకు ఖరీదైన బహుమతులను అందించారని ఈడీ తెలిపింది. అలాగే.. జాక్వెలిన్ తల్లిదండ్రులకు కూడా ఖరీదైన కార్లు ఇచ్చారని, ఆమె తోబుట్టువులకు బహుమతులు కూడా ఇచ్చారని, తనకు, ఆమె కుటుంబానికి బహుమతులు చంద్రశేఖర్ అందజేసినట్టు జాక్వెలిన్ స్వయంగా ఒప్పుకుందని ఈడీ పేర్కొంది.
ఏప్రిల్‌లో విడుదల చేసిన ED ప్రకటనలో దోపిడీ వంటి చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా సంపాదించిన మొత్తం రూ. 5.71 కోట్లను చంద్రశేఖర్ ఆమెకు బహుమతులుగా ఇచ్చాడని పేర్కొంది. అలాగే.. ఆమెపై దర్యాప్తు చేసిన విషయాన్ని ప్రధానంగా పేర్కొంది. చంద్రశేఖర్ ఇచ్చిన బహుమతులతో పాటు, హవాలా ఆపరేటర్ అయిన అవతార్ సింగ్ కొచ్చర్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కుటుంబ సభ్యులకు 1,72,913 యూఎస్ డాల్లర్ల మొత్తాన్ని అందించాడు.
అలాగే.. ఫెర్నాండెజ్ వెబ్ సిరీస్ స్క్రిప్ట్‌ను రూపొందించినందుకు చంద్రశేఖర్.. ఫెర్నాండెజ్ తరపున స్క్రిప్ట్ రైటర్‌కు అడ్వాన్స్‌గా 15 లక్షలు చెల్లించినట్లు కూడా వెల్లడైంది. అలాగే.. ఫెర్నాండెజ్ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు ఇతర బహుమతులు, చంద్రశేఖర్ తో కలిసి విహారయాత్రలను వెళ్లినట్టు ఆమె కూడా అంగీకరించింది, అయితే.. తాను ఎప్పుడూ ఎలాంటి చట్టవిరుద్ధమైన లావాదేవీలలో పాల్గొనలేదని ఫెర్నాండెజ్ పేర్కొంది.
ఎఐఎడిఎంకె ఎన్నికల గుర్తును కేటాయించడంపై వచ్చిన విభేదాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అధికారులకు లంచం ఇచ్చేందుకు ఎఐఎడిఎంకె నేత టిటివి దినకరన్ నుంచి డబ్బు తీసుకున్నారనే ఆరోపణలపై చంద్రశేఖర్ ఏప్రిల్ 2017లో అరెస్టయ్యారు. అతను ప్రభుత్వ అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావించేలా ప్రజలను మోసం చేయడానికి తీహార్ నుండి నకిలీ కాల్స్ చేశాడు.
2020లో మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్యకు కేంద్ర హోం, న్యాయ కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందిగా మారువేషాలు వేసి పార్టీ ఖజానాకు విరాళం పేరుతో సుమారు 200 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. గత ఏడాది ఆగస్టులో చెన్నైలోని ఒక విలాసవంతమైన ఇల్లు, 26 ఆటోమొబైల్స్‌తో సహా చంద్రశేఖర్ ఆస్తులను ED జప్తు చేసింది.