బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడికి యత్నం: ముగ్గురు అరెస్ట్

By narsimha lodeFirst Published May 18, 2021, 12:59 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బందిని ముగ్గురు దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బందిని ముగ్గురు దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గోవింద్‌ నగర్‌ అసెంబ్లీ స్థానం నుండి సురేంద్ర మిథాని  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాన్పూర్‌లోని పండునగర్‌ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు.దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్‌కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.

ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ ఆనంద్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే  సురేంద్ర మిథాని తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించారు.  ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. 

ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ముగ్గురు ఎందుకు ప్రయత్నించారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు బాంబులు, మారణాయుధాలు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!