'మహా' జగడం: సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా రనౌత్

By telugu teamFirst Published Sep 11, 2020, 12:38 PM IST
Highlights

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్ చేశారు. సోనియా మౌనంపై చరిత్ర తీర్పు చెబుతుందని కంగనా అన్నారు.

ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన విమర్శలకు పదును పెడుతూనే ఉన్నారు. తాజాగా ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెసు భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో కంగనా సోనియా గాంధీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేసినట్లు కనిపిస్తున్నారు. 

చరిత్ర మీ మౌనంపై, వివక్షపై తీర్పు చెబుతుందని ఆమె సోనియాను ఉద్దేశించి అన్నారు. తన కార్యాలయాన్ని కూల్చివేయడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఆమె అన్నారు. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వం నా పట్ల వ్యవహరిస్తున్న తీరు మహిళగా మీకు ఆగ్రహం కలిగించడం లేదా అని ఆమె సోనియాను ప్రశ్నించారు. 

Also Read: కంగనా 'మహా' జగడం: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఎంట్రీ

డాక్టర్ అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగ సూత్రాలను గౌరవించాలని మీరు మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలేరా ఆని ఆమె సోనియాను అడిగారు. "మీరు పశ్చిమాన పుట్టిపెరిగి భారతదేశంలో నివసిస్తున్నారు. మహిళల సమస్యలు మీకు తెలిసే ఉంటాయి. మీ సొంత ప్రభుత్వం ఓ మహిళను వేధిస్తూ శాంతిభద్రతలను అపహాస్యం చేస్తున్న స్థితిలో మీ మౌనంపై చరిత్ర తీర్పు చెబుతుంది. మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అని కంగనా అన్నారు.

Also Read: కంగనకు సౌత్‌ స్టార్ మద్దతు.. భగత్‌ సింగ్‌తో పోలుస్తూ!

శివసేనపై మరోసారి ఆమె విరుచుకుపడ్డారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను ప్రస్తావిస్తూ శివసేనపై విమర్శలు చేశారు. తను అభిమానించేవారిలో మహామహుడు బాల సాహెబ్ థాకరే ఒకరని, ఏదో ఒక రోజు శివసేన పొత్తు పెట్టుకుని కాంగ్రెసుగా మారిపోతుందేమోనని ఆయన భయపడ్డారని కంగనా అన్నారు. తన పార్టీ పరిస్థితిని చూసి బాల్ థాకరే ఏ విధమైన మానసిక స్థితికి గురై ఉండేవారో మీరు ఊహించగలరా అని అడిగారు.

click me!