కమల్ హాసన్ పార్టీ తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని ఆయన వివరించారు. రెండు రోజుల్లో గుడ్ న్యూస్‌తో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.
Kamal Hasan: ప్రముఖ సినీ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ ఏది మాట్లాడినా.. ఏం చేసినా సంచలనమే. ముఖ్యంగా రాజకీయ పరిణామాలపై ఆయన చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. 2018లో ఆయన తమిళనాడులో ఎంఎన్ఎం పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. 2019 లోక్ సభ ఎన్నికల్లో, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. కమల్ హాసన్ పలుమార్లు ద్రావిడియన్ ఐడియాలజీ నుంచే కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ద్రావిడియన్ పార్టీతోనే పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు ఇది వరకే ఉన్నాయి.
అందులోనూ ఏఐఏడీఎంకే కంటే కూడా డీఎంకేతోనే ఆయన కలిసి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని ఇది వరకే చర్చ జరిగింది. అంతేకాదు, మంత్రి ఉదయనిధి కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. తాజాగా, కమల్ హాసన్ కూడా ఇదే కోణంలో వ్యాఖ్యలు చేశారు. డీఎంకేతో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని వెల్లడించారు. రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానని వివరించారు. చెన్నై ఎయిర్‌పోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read : పశ్చిమ బెంగాల్ హింసలో.. ఎస్ఎస్ రాజమౌళి ‘విక్రమార్కుడు’ సినిమా.. ఆ పిక్‌తో సోషల్ మీడియాలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్
లోక్ సభ ఎన్నికలు తమకు ఒక మంచి అవకాశం అని కమల్ హాసన్ వివరించారు. మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్‌తో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. డీఎంకే, ఎంఎన్ఎం పార్టీల పొత్తు పై గత సెప్టెంబర్‌లోనే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూత్రప్రాయంగా చెప్పారు. ఎన్నిలకు ముందు దీని పై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. గతంలో సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కమల్ హాసన్ మద్దతుగా నిలవడం గమనార్హం.