యూపీలో శ్రీ కల్కి ధామ్ ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ సుప్రీంకోర్టుపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ఎలక్టోరల్ బాండ్ల పథకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు.
ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకృష్ణుడికి సుదాముడు అన్నం పెడితే.. భగవంతుడు కూడా అవినీతికి పాల్పడ్డాడని తీర్పు వెలువడేదని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్ల విలువైన 14 వేల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
అందులో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం సమక్షంలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసి సంభాల్ జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా సుప్రీంకోర్టుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శ్రీకృష్ణుడు, సుధాముడి కథను ఉదాహరించారు.
Whole Secular Gang destroyed in one statement
😂😂😂 pic.twitter.com/nUZGCd2RLS
ప్రధాని మోడీ తనను తాను శ్రీకృష్ణుడిగా, ఆచార్య ప్రమోద్ కృష్ణంను సుదామతో పోల్చారు. ‘‘ఆయన (ఆచార్య ప్రమోద్ కృష్ణంను ఉద్దేశించి) వద్ద ప్రతీ ఒక్కరికీ ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంది. కానీ నా దగ్గర ఏమీ లేదు. నేను నా భావాలను మాత్రమే వ్యక్తీకరించగలను. ప్రమోద్ గారూ.. మీరు నాకు ఏమీ ఇవ్వకపోవడమే మంచిది. లేకపోతే నేటి యుగంలో సుదామ శ్రీకృష్ణుడికి అన్నదానం చేస్తే.. ఆ వీడియో బయటకు వస్తే సుప్రీంకోర్టులో పిల్ వేసి, శ్రీకృష్ణుడికి ఏదో ఇచ్చారని, శ్రీకృష్ణుడు అవినీతి చేస్తున్నాడని తీర్పు వచ్చే విధంగా కాలం మారిపోయింది. మీ ఫీలింగ్స్ ని వ్యక్త పరచి ఏమీ ఇవ్వకుండా ఉంటే బావుంటుంది...’’ అని అన్నారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకంలో కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రధాని మోడీ ప్రకటన సుప్రీంకోర్టుపై పరోక్ష వ్యంగ్యంలా ఉంది. పిల్ ఆధారంగా కోర్టు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ను రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేయడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు.