న్యాయ దేవత కళ్లు తెరిచింది: సుప్రీం కోర్టులో కొత్త విగ్రహం ఏర్పాటు

By Naga Surya Phani KumarFirst Published Oct 16, 2024, 8:57 PM IST
Highlights

న్యాయదేవత కళ్లు తెరిచింది. అదేమిటి న్యాయ దేవత కళ్లకు గంతలు ఉంటాయి కదా.. అనుకుంటున్నారా? ఆ గంతలు ఇప్పటి నుంచి ఉండవు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు న్యాయదేవత కళ్లకు ఉన్న గంతలు తొలగించి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టులో అలాంటి ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉంది. 

స్వతంత్రం వచ్చినా బ్రిటీష్ పాలకులు బిగించిన చట్రంలోనే భారత దేశం పరిపాలన సాగుతోందన్నది అందరికీ తెలిసిన నిజం. అయితే ఎవరూ ఆ సంకెళ్ల ఆనవాళ్లను వదలించడానికి ప్రయత్నించలేని పరిస్థితి. అయితే అప్పటి బ్రిటీష్ పాలకులు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయదేవత విగ్రహాన్ని ఇలా కళ్లకు గంతలు కట్టి ఏర్పాటు చేశారు. ఇంత కాలం న్యాయదేవత కళ్లకు గంతలతో పాటు ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి ఉండేవి. 

చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టేవారు. కుడి చేతిలో ఉండే త్రాసు న్యాయానికి సూచికగా ఉండేది. ఎడమ చేతిలో ఖడ్గం అన్యాయాన్ని న్యాయదేవత సహించదని, అంతం చేస్తుందని తెలిపేందుకు ఏర్పాటు చేశారు. 

Latest Videos

ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం కళ్లకు గంతలు తీసేశారు. దీని అర్థం ఏమిటంటే చట్టం కళ్లున్నా చూడలేని గుడ్డిది కాదు. రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగా చూడగలదని చెప్పడానికే న్యాయదేవత కళ్లకు గంతలు తీసేశారు. అదేవిధంగా ఎడమ చేతిలో ఉన్న కత్తి బదులు రాజ్యాంగం ఉంచారు. దీని అర్థం ఏమిటంటే రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయదేవత జరిగిన అన్యాయాన్ని గుర్తించి శిక్ష విధిస్తుంది. ఈ విషయాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఆయన ఆదేశాల మేరకే న్యాయదేవత విగ్రహంలో ఈ మార్పులు చేశారు. 

న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదన్న సందేశం బలంగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇలా న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బ్రిటీష్ పాలన ముగిసినా భారతదేశంలో వారి పరిపాలన పద్ధతులు ఇంకా కొనసాగుతుండటం, ఆ మూలాలను తీసేయాలన్న సంకల్పంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నగరాల పేర్లు, కొన్ని చట్టాలను మార్చారు. ఈ చర్యల కొనసాగింపులో భాగంగానే న్యాయదేవతకు కొత్త రూపునిచ్చారు. 

click me!