సుప్రీం కోర్టులో బిల్కిస్ బానో పిటిషన్‌.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేల ఎం త్రివేది..

By Sumanth KanukulaFirst Published Dec 13, 2022, 3:57 PM IST
Highlights

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, తన కుటుంబంలోని ఏడుగురిని చంపిన కేసులో 11 మంది దోషుల శిక్షను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, తన కుటుంబంలోని ఏడుగురిని చంపిన కేసులో 11 మంది దోషుల శిక్షను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది మంగళవారం తప్పుకున్నారు. 

న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన వెంటనే.. జస్టిస్ రస్తోగి తన సోదరి న్యాయమూర్తికి (జస్టిస్ బేల ఎం త్రివేది) ఈ కేసును విచారించడం ఇష్టం లేదని అన్నారు. ‘‘మాలో ఎవరూ సభ్యులు లేని బెంచ్ ముందు ఈ అంశాన్ని జాబితా చేయండి’’ అని జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ బేల ఎం  త్రివేది విచారణ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ధర్మాసనం పేర్కొనలేదు.

బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మొదటి పిటిషన్‌లో.. దోషి అభ్యర్ధనపై సుప్రీంకోర్టు 2022 మే 13 నాటి ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు. 1992 జూలై 9 నాటి పాలసీ ప్రకారం దోషులను ముందస్తుగా విడుదల చేయాలనే అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో గుజరాత్ ప్రభుత్వాని తెలిపింది. ఇక, రెండో పిటిషన్‌లో దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. ఇందుకు సంబధించి జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనంలో ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా, జస్టిస్ బేల ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు.

ఇక, గోద్రా రైలు దగ్ధం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల నుంచి పారిపోతుండగా బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమె వయసు 21 ఏళ్లు కాగా.. ఐదు నెలల గర్భిణిగా ఉన్నారు. అలాగే హత్య చేయబడిన ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఆమె మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించగా..  విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది.
ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు వారి నేరాన్ని సమర్థించాయి.

ఈ కేసులో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించింది. 

click me!