
ప్రజలకు మన చుట్టూ జరుగుతున్న వార్తలను, విశేషాలను అందజేయాలనే లక్ష్యంతో పనిచేసే జర్నలిస్టులు (journalist) అప్పుడప్పుడు విధి నిర్వహణలో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో (odisha) బాంబు పేలిన ఘటనలో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని కలహండిలో (kalahandi) త్వరలో పంచాయతీ ఎన్నికలు (panchayat election in odisha) జరగనున్నాయి.
అయితే వీటిని బహిష్కరించాలని మావోయిస్టులు (maoists) ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లను సైతం ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నా రోహిత్ కుమార్ బిస్వాల్ (46) (rohit kumar biswal). తన విధుల్లో భాగంగా మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు మావోయిస్టులు అంటించిన పోస్టర్లు, బ్యానర్లను పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ మావోలు పాతిపెట్టిన ఐఈడీ బాంబు పేలడంతో రోహిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు
పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబులు అమర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అటు రోహిత్ మరణవార్త తెలుసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (naveen patnaik) సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇలాంటి పోస్టర్లు, బ్యానర్లు కనిపించినప్పుడు పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని బాంబు డిస్పోజబుల్ టీమ్స్‌తో తనిఖీలు నిర్వహిస్తాయి. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళతారు.
అయితే దురదృష్టవశాత్తూ భద్రతా దళాలు వెళ్లే లోపే రోహిత్ అక్కడకు చేరుకోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అటు రోహిత్ మరణంపై ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం (odisha union of journalists) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మావోయిస్టుల దుశ్చర్యను ఖండించింది. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో విధులు నిర్వహించే పాత్రికేయులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.