
Rajasthan : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జోధ్‌పూర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూను.. నగరంలోని 10 ప్రాంతాలలో మార్చి 8 ఉదయం 12 గంటల వరకు పొడిగించారు. ఈద్ సందర్భంగా మతపరమైన హింస చెలరేగినప్పటి నుండి నగరం కర్ఫ్యూలో ఉంది. ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనక పోవడంతో కర్ఫ్యూను పొడిగిస్తూ జిల్లా పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. “ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ పొడిగించబడింది. జోధ్‌పూర్ కమిషనరేట్ ప్రాంతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 144 ప్రకారం నిషేధ ఉత్తర్వులు జారి చేయబడ్డాయి. 08.05.2022 అర్ధరాత్రి 12:00 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది” అని ఉత్తర్వుల్లో పెర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే, వైద్య సేవల్లో నిమగ్నమైన సిబ్బంది, బ్యాంకు అధికారులు, న్యాయ అధికారులు, మీడియా సిబ్బందికి కూడా సెక్షన్ 144 నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతకుముందు రోజు, ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతించడానికి ఉదయం 8 గంటల నుండి రెండు గంటల పాటు కర్ఫ్యూను ఎత్తివేశారు . శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఒక రోజు తర్వాత ముందు జాగ్రత్త చర్యగా సడలింపు సమయంలో వాహనాల వినియోగానికి అనుమతిని నిరాకరించారు.
కాగా, ఈద్‌కు ముందు రాజస్థాన్‌లో ఘర్షణలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. అల్లర్లు మరింత ముదరకుండా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం రాత్రి ఈద్‌కు ముందు జలోరీ గేట్ ప్రాంతంలో రెండు వర్గాలకు చెందిన వారు తమ జెండాలు ఎగురవేయడంపై వివాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు. మొదట వాగ్వివాదంతో మొదలైన.. ఘర్షణకు దారి తీసిందని తెలిపారు. ప్రజలు పుకార్లు వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి జోధ్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఈద్ కోసం ప్రార్థన స్థలాలు, కార్యక్రమాలను పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.
ప్రస్తుతం జోధ్‌పూర్‌లో మూడు రోజుల పరశురామ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈద్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాలు పెట్టిన మతపరమైన జెండాలు ఘర్షణలకు దారితీశాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్-గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన పలువురు స్థానిక పోలీసు పోస్ట్‌పై దాడి చేశారు. మంగళవారం తెల్లవారుజామున రాళ్లు రువ్వడంతో కనీసం నలుగురు పోలీసులు గాయపడ్డారు. "రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు" అని పోలీసు కంట్రోల్ రూమ్‌లోని ఒక అధికారి మీడియాకు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శాంతిభద్రతలను కాపాడాలని అంతకు ముందు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.