
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌లో ఈ రోజు ఎన్‌కౌంటర్ జరిగింది. వచ్చే నెలాఖరు నుంచి ఇదే పహల్‌గామ్ గుండా అమర్‌నాథ్ యాత్ర జరగనుంది. దక్షిణ కశ్మీర్‌లో పహల్‌గామ్‌లో టూరిస్టు రిసార్ట్ ఈ యాత్రికుల కోసం బేస్ క్యాంప్‌గా పని చేస్తుంది. అటువంటి ఈ పహల్‌గామ్‌లోనే భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. తద్వార యాత్ర సమయంలో టెర్రరిస్టులు వ్యూహాలు రచించిన విధ్వంసానికి ముందుగానే బ్రేకులు వేసినట్టయింది.
ఈ రూట్‌లో సమీప భవిష్యత్‌లో చోటుచేసుకునే ఉగ్ర బీభత్సాన్ని అరికట్టడానికి ఈ ఎన్‌కౌంటర్ దోహదపడుతుందని, అందులో తాము మంచి విజయం సాధించినట్టేనని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఇందులో దీర్ఘకాలంగా యాక్టివ్‌లో ఉన్న ఓ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఉన్నాడని తెలిపారు.
హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన చాన్నాళ్లుగా క్రియాశీలకంగా ఉన్న అశ్రఫ్ మోల్వీతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
పహల్‌గామ్ అడవిలో టెర్రరిస్టులు తలదాచుకున్నట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఆ సమాచారంతోనే తాము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ చేస్తుండగానే అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు తమపై కాల్పులు జరిపారని వివరించారు. వారిని ఎదుర్కోవడానికి తాము కూడా ఎదురుకాల్పులు చేపట్టామని తెలిపారు. తత్ఫలితంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారని వివరించారు.
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోనూ గత నెల 24వ తేదీన ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలోని పహూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం రావడంతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగింది. బలగాలు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంతో దాక్కున్న ఉగ్రవాదులు భద్రత బలాగాలపై కాల్పులు జరిపారని, దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు ఎల్‌ఇటి ఉగ్రవాదులను లెటి టాప్ కమాండర్ బాసిత్ డిప్యూటీ ఆరిఫ్ అహ్మద్ హజార్, అబూ హుజైఫా, నతీష్ వానీలుగా గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం..ఈ ముగ్గురూ నిందితులు అనేక కేసులున్నాయి. వీరి అనేక సార్లు ఉగ్ర దాడుల్లో పాల్గొన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ స్థలం భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాలన్నీ తదుపరి విచారణ కోసం.. రికార్డు చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఎన్ కౌంటర్ పై కాశ్మీర్ ఐజిపి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌ను భారీ విజయంగా అభివర్ణించారు. ఎటువంటి ప్రాణహని లేకుండా.. ప్రొఫెషనల్ పద్ధతిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను నిర్వహించినందుకు భద్రతా బలగాలను అభినందించారు.