జార్ఖండ్‌ను వణికిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.... నెల వ్యవధిలో 800 పందులు మృతి, సర్కార్ అలర్ట్

By Siva KodatiFirst Published Aug 28, 2022, 9:23 PM IST
Highlights

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) భయంతో జార్ఖండ్ రాష్ట్రం వణికిపోతోంది. జూలై 27 నుంచి రాంచీ జిల్లాలో 800కి పైగా పందులు చనిపోయాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పందులకు అత్యంత హనీ కలిగించే అంటు వ్యాధి. అయితే ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించదు. 
 

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) భయంతో జార్ఖండ్ రాష్ట్రం వణికిపోతోంది. జూలై 27 నుంచి రాంచీ జిల్లాలో 800కి పైగా పందులు చనిపోయాయని అధికారులు చెబుతున్నారు. మన దేశంలో తొలిసారిగా ఫిబ్రవరి 2020లో అస్సాంలో ఈ వైరస్‌ను కనుగొన్నారు. 

తాజా పరిస్ధితిపై జార్ఖండ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ శశి ప్రకాష్ ఝూ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల ప్రారంభంలో భోపాల్‌లోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరి యానిమల్ డిసీజ్ (ఎన్‌ఐహెచ్ఎస్‌ఏడీ)కి పరీక్ష కోసం నమూనాలను పంపారు. అయితే అవి పాజిటివ్‌గా వచ్చాయని శశి ప్రకాష్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏఎస్ఎఫ్ కారణంగా 1,000 పందులు చనిపోయాయని ఆయన అన్నారు . ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పందులకు అత్యంత హనీ కలిగించే అంటు వ్యాధి. అయితే ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించదు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా.. పశుసంవర్ధక శాఖ ‘‘చేయాల్సినవి’’, ‘‘చేయకూడనివి’’ అనే జాబితాను అధికార యంత్రాంగానికి, ప్రజలకు అందజేసింది. 

అయితే ఇప్పటి వరకు రాంచీ జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో పందుల మరణాలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ జార్ఖండ్‌లోని 24 జిల్లాలకు ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు గాను పందుల పెంపకందారులను.. వీటిని అమ్మడం, పంది మాంసాన్ని విక్రయించడం నిలిపివేయాలని అధికారులు కోరారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా పందుల మరణాలు సంభవించినట్లయితే ప్రభుత్వం సూచించిన టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. పశు సంవర్థక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. జంతువుల కళేబరాన్ని సక్రమంగా పారవేయాలని కూడా పేర్కొన్నారు.

పిగ్రీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అజయ్ కుమార్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. జూలై 27 నుంచి 666 పందులు చనిపోయాయని తెలిపారు. అలాగే చన్హో, కుచు, మెక్‌క్లస్కీగంజ్, ఖలారితో సహా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సుమారు 100 పందుల మరణాలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. రాంచీలోని బిర్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ క్షేత్రంలోనూ దాదాపు 30 మందులు చనిపోయాయి. జ్వరం రావడం, ఆకస్మాత్తుగా తినడం మానేయడం , ఆ కొద్దిరోజులకే చనిపోవడం ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ లక్షణాలని అధికారులు చెబుతున్నారు.     

click me!