జార్ఖండ్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందా? హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ బాధ్యతలు తీసుకుంటారా? జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్ పగ్గాలు తీసుకుంటారా? అనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఈడీ అధికారులు సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేస్తే మాత్రం కల్పనా సోరెన్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది.
Hemanth Soren: జార్ఖండ్ సీఎం మిస్సింగ్ అంటూ కథనాలు వచ్చాయి. ఆయన కొద్దికాలం ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఆయన కొంతకాలం మిస్సింగ్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఇంతలోనే మళ్లీ అనూహ్యంగా ఆయన రాంచీలో ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో సోరెన్‌ను ఈడీ అధికారులు ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చనే చర్చ జరుగుతున్నది.
దీంతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక వేళ సీఎం సోరెన్‌ను ఈడీ అరెస్టు చేస్తే ప్రభుత్వ సారథిగా ఎవరు ఉంటారా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ రాజకీయ రంగంలోకి దిగుతారని, ఆమెనే సీఎం పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
undefined
ఒక వైపు ఈ చర్చ జరుగుతుండగా రాంచీలో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు, పార్టీ ఎమ్మెల్యే సమావేశానికి హేమంత్ సోరెన్ భార్య కూడా హాజరుకావడం ఈ వాదనలకు బలాన్నిచ్చాయి. ఒక వేళ హేమంత్ సోరెన్ అరెస్టు అయితే మాత్రం కల్పనా సోరెన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఆమెను పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల భేటీకి తీసుకువచ్చినట్టు తెలుస్తున్నది.
మరోవైపు బీజేపీ ఎంపీ కూడా ఇదే కోణంలో ఆరోపణలు చేశారు. సీఎం కుర్చీపై హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పేర్కొన్నారు.