జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బుధవారం సమర్పించారు. ఏడు గంటలపాటు ఈడీ విచారణలో హేమంత్ సోరెన్ ప్రశ్నలు ఎదుర్కొన్న సందర్భంలో ఈ వార్త బయటకు వచ్చింది.
Hemanth Soren Resigns: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు అందరితో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బుధవారం అందజేశారు. ల్యాండ్ స్కామ్ కేసులో ఆయన ఏడు గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో ప్రశ్నలు ఎదుర్కొన్న సందర్భంలో ఈ వార్త బయటికి వచ్చింది. తదుపరి ముఖ్యమంత్రిగా రవాణ శాఖ మంత్రి చంపయ్ రాయ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనను శాసన సభా పక్ష నాయకుడిగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
‘హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శాసనసభ పక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్నాం. ఎమ్మెల్యేలు అందరూ మాతోనే ఉన్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. జార్ఖండ్‌లో భూ యాజమాన్య హక్కులను అక్రమంగా మాఫియా మార్చిన పెద్ద ర్యాకెట్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో భాగంగా హేమంత్ సోరెన్‌ను విచారించింది.
ఈడీ టీమ్ హేమంత్ సోరెన్ నివాసం వద్ద 13 గంటలపాటు ఉన్నది. రూ. 36 లక్షలు, పలు దస్త్రాలను ఈడీ కనుగొంది. సోరెన్ నివాసంలో ఓ విలాసవంతమైన ఎస్‌యూవీని కూడా సీజ్ చేసింది.
Also Read: Maoists: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల రహస్య సొరంగాలు బట్టబయలు.. వీడియో షేర్ చేసిన అధికారులు
జార్ఖండ్ మంత్రి, జేఎంఎం నేత మిథిలేశ్ ఠాకూర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘మేము మా నాయకుడిని ఎన్నుకున్నాం. మా తదుపరి సీఎం చంపయ్ సోరెన్’ అని వివరించారు. చంపయ్ సోరెన్ సెరాయికెల్లా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ సింగభమ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
జార్ఖండ్ అధికార కూటమిలో జేఎంఎంతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ, లెఫ్ట్, ఆర్జేడీలు ఉన్నాయి. జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీ, లెఫ్ట్, ఆర్జేడీలకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున బలాలు ఉన్నాయి.
గవర్నర్ అనుమతి ఇస్తే.. ఎమ్మెల్యేల బలాన్ని చూపెడుతామని కాంగ్రెస్ నేత రాజేశ్ ఠాకూర్ తెలిపారు.