జూలై- ఆగస్టులో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు: షెడ్యూల్ ఇదే..!!

By Siva KodatiFirst Published Jul 6, 2021, 8:47 PM IST
Highlights

ఐఐటీ, నిట్‌ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25 వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు

ఐఐటీ, నిట్‌ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25 వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్‌ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.   

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌, మేలో నిర్వహించాల్సిన సెషన్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే, తొలి విడత ఫిబ్రవరిలో, రెండో విడత మార్చిలో నిర్వహించగా..  తదుపరి ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించాల్సిన రెండు సెషన్‌లు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ సెషన్లో 6.80 లక్షల మంది, మే సెషన్‌లో 6.09లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తొలి విడతలో 6.20లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. రెండో విడతలో 5.56లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  

click me!