
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైతే విడిపోవాల్సి వస్తుందని ఓ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వారిద్దరూ కవలలు కావడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది. కవల ఆడపిల్లలు పుట్టడంతో ఆనందంలో మునిగి తేలిన కుటుంబం, వారి మరణంతో విషాదంలో మునిగిపోయింది.
వారద్దరూ తల్లికడుపులో జతకట్టిన నాటినుంచి చివరికి చావును కౌగిలించుకునేనాటి దాకా కలిసే ఉన్నారు. పెళ్లి తమను విడదీస్తుందన్న భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
కర్ణాటక లో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెడితే కర్ణాటక, మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, యశోద దంపతలుకు దీపిక, దివ్య అనే ఇద్దరు కవల పిల్లలు. వారికి యుక్తవయసు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతున్నారు.
మొదట కవలలకు, కవలలను.. లేదా ఒకే ఇంట్లోని వారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన సంబంధాలు దొరకలేదు. దీంతో వేర్వేరు కుటుంబాలకు చెందిన వారికి ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.
అయితే, ఇది ఆ కవల సోదరీమణులకు కలవరం పుట్టించింది. పెళ్లైతే తామిద్దరం ఒకే దగ్గర ఉండలేం అనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. విడిపోతామని మనస్తాపానికి గురయ్యారు.
దీంతో దీపిక, దివ్యలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తమ గదుల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసి కోలుకోలేకపోయారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.
పెళ్లి చేసి వారిని పిల్లా పాపలతో చూసి సంతోషించాలనుకున్న తమ కల... ఇలా వారినే తమకు కాకుండా చేస్తుందనుకోలేదని ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై అరికేర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.