
న్యూఢిల్లీ: ఇప్పటికే వరదలతో కొట్టుమిట్టాడుతున్న అసోంను మరో సమస్య చుట్టుముట్టింది. జపనీస్ ఎన్సిఫాలిటిస్ డిసీజ్ విజృంభిస్తున్నది. దోమలతో వ్యాప్తి చెందే ఈ వ్యాధి కారణంగా జపాన్‌లో గత 15 రోజుల్లో 23 మంది మరణించినట్టు నేషనల్ హెల్త్ మిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నిన్న ఒక్క రోజే నలుగురు మృతి చెందినట్టు తెలిపింది. నల్బరి, మారిగావ్ జిల్లాల్లో రెండు చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు, గత 24 గంటల క్రితం కొత్తగా 16 జపనీస్ ఎన్సిఫాలిటిస్ కేసులు నమోదైనట్టు నిన్న నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది.
కొత్తగా రిపోర్ట్ అయిన 16 కేసుల్లో బార్పేట, కామరూప్ మెట్రోపాలిటన్, కర్బీ ఆంగ్లాంగ్ ఈస్ట్, హొజాయ్‌లలో ఒక్కో కేసు నమోదైంది. నగావ్‌లో నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి. శివసాగర్‌లో రెండు కేసులు, నల్బరి, ఉదల్గూరి జిల్లాల్లో మూడు కేసుల చొప్పున నమోదు అయినట్టు నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది.
జులై 1వ తేదీ నుంచి మొత్తంగా అసోంలో 160 జపనీస్ ఎన్సిఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి.
అసోం ఎగువ జిల్లాల్లో గోలాఘాట్, జొర్హాట్, మజులి, శివసాగర్, లఖింపూర్, సెంట్రల్ అసోం జిల్లాలు నగావ్, హొజాయ్, మారిగావ్, కర్బి ఆంగ్లాంగ్ ఈస్ట్‌తోపాటు దిగువ అసోం జిల్లాలు బర్పేటా, కామరూప్ మెట్రోపాలిటన్, నల్బరి, ఉదల్గూరిల్లో జపనీస్ ఎన్సిఫాలిటిస్ వ్యాధి ప్రబలింది.
అసోంలో జపనీస్ ఎన్సిఫాలిటిస్ డిసీజ్ ప్రస్తుతం కంట్రోల్‌లోనే ఉన్నదని హెల్త్ సర్వీసెస్ (మలేరియా), నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అసోం స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ఎన్ నూనిసా తెలిపారు. ఈ వ్యాధి పై పోరాడటానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని, పటిష్ట నిఘా పెడుతున్నామని వివరించారు. వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటివి సమస్యను తీవ్రం చేస్తున్నాయని తెలిపారు. దోమ తెరలను ఈ వ్యాధి ప్రభావిత జిల్లాల్లో పంపిణీ చేస్తున్నామని చెప్పారు.