బీజేపీ ప్ర‌భుత్వానికి మద్దతు ఉపసంహరించుకోబోతున్నాం.. మ‌ణిపూర్ జేడీయూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ ..

By Rajesh KFirst Published Aug 30, 2022, 5:25 PM IST
Highlights

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని మ‌ణిపూర్ సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలిగే ప్రక్రియను ప్రారంభించిన‌ట్టు జేడీ(యూ) మణిపూర్‌ యూనిట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌హెచ్‌ బీరెన్‌ సింగ్  ప్ర‌క‌ట‌న చేశారు.

ఇటీవ‌ల దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తడం, పొత్తులను విర‌మించుకోవ‌డం, అధికారంలో ఉన్న‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డం, అధికారం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మార‌డం వంటివి రాజ‌కీయ ప‌రిణామాల‌ను చూస్తున్నాం.. తాజాగా బీహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి యునైటెడ్‌(జేడీ(యూ)) వీడ్కోలు చెప్పి.. ఆర్ జేడీయూతో  అధికారం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే... అయితే.. మణిపూర్‌లోని బీజేపీ సర్కార్ తో మాత్రం మద్దతు కొనసాగిస్తూనే ఉంది. 

కానీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలిగే ప్రక్రియను జేడీ(యూ) మణిపూర్ యూనిట్ కూడా ప్రారంభించిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా  జేడీ(యూ) మణిపూర్‌ యూనిట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌హెచ్‌ బీరెన్‌ సింగ్ కీల‌క‌ ప్రకటన చేశారు. మణిపూర్‌లోని ఎన్డీయే కూట‌మి నుంచి  బయటకు రాబోతున్న‌మ‌నీ, అదే స‌మ‌యంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకునే ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని ప్ర‌క‌టించారు. 

అంతేకాదు.. సెప్టెంబర్ 3-4 తేదీల మధ్య పాట్నాలో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో జెడి(యు) జాతీయ నాయకులను కలుస్తామని చెప్పారు.ఈ భేటీ అనంతరం అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి మణిపూర్‌లోని జేడీ(యూ) ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారని తెలిపారు. వాస్తవానికి ఆగస్టు 10వ తేదీనే మణిపూర్‌ జేడీయూ యూనిట్‌ తెగదెంపులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో ప్రకటన జాప్యం అవుతూ వస్తోంది. 
  
మణిపూర్‌ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా.. బీజేపీ ప్రభుత్వం 55 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అందులో బీజేపీ 32 సీట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ 7 సీట్లు,  జేడీయూకు ఆరు సీట్లు , మిగతా వాళ్లు ప్రాంతీయ పార్టీల వాళ్లు  ఉన్నారు.  

గత ప్రభుత్వంలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ 5 సీట్లు గెలుచుకున్నాయి. కుకీ పీపుల్స్ అలయన్స్ 2 స్థానాలను కైవసం చేసుకోగా, ముగ్గురు స్వతంత్రులు కూడా విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కూటమికి జేడీ(యూ)తో సహా 55 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం కుప్పకూలే అవకాశం లేదు. అయితే ప్రాంతీయ పార్టీల్లో బీజేపీ వ్య‌వ‌హ‌ర శైలిపై  విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశముంది. 

మరోవైపు మణిపూర్‌ బీజేపీలో నేతల మధ్య అసంతృప్తి పెరుగుతున్న సంద‌ర్బంలో బీజేపీ మణిపూర్‌ మాజీ కార్యవర్గ సభ్యుడు, అధికార ప్రతినిధి నిమైచంద్‌ లువాంగ్‌ తన మద్దతుదారులతో కలిసి సోమవారం ఇంఫాల్‌ కార్యాలయంలో జేడీ(యూ)లో చేరారు.

click me!