Women Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే విధంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం శుభ పరిణామని అన్నారు.
Women Reservation Bill: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'నారీ శక్తి వందన్ బిల్లు' లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై స్లిప్ ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతివ్వడం విశేషం.
ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాన్ స్పందిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే విధంగా 'నారీ శక్తి వందన్ అధినియమ్' బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం శుభ పరిణామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నూతన పార్లమెంట్ భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదే కావడంతో 'నారీ శక్తి వందన్ అధినియమ్' చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు.
ఆకాశంలో సగం అంటూ మహిళలను మెప్పించే మాటలకు పరిమితం కాకుండా వారి శక్తిసామర్థ్యాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించేలా బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి పవన్ కళ్యాన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ బిల్లును ఉద్దేశించి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారని, వారికి, ఈ బిల్లుపై విలువైన చర్చలు చేసి ఆమోదం పొందటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.'నారీ శక్తి వందన్ అధినియమ్' మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని జనసేనాని విశ్వసించారు.
మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభ పరిణామం - JanaSena Chief shri pic.twitter.com/npFOykXIRK
— JanaSena Party (@JanaSenaParty)