
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవి నుంచి ఫరూఖ్ అబ్దుల్లా వైదొలిగారు. శ్రీనగర్‌లో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తన ఆరోగ్యం పార్టీకి నాయకత్వం వహించడానికి సహకరించడం లేదని వివరించారు. ఈ పదవి కోసం పార్టీలో నుంచి ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపారు. ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ అని చెప్పారు. కొత్త తరానికి కూడా దారి ఇవ్వాలి కదా అంటూ పేర్కొన్నారు. 1983లో ఆయన తొలిసారి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
జేకేఎన్‌సీ చీఫ్‌గా ఫరూఖ్ అబ్దుల్లా దిగిపోవడంతో తదుపరి అధ్యక్ష ఎన్నికలకు తెర లేసింది. జనరల్ సెక్రెటరీ ఈ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాల్సి ఉన్నది. ఈ ఎన్నిక వచ్చే నెల 5వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉన్నది. అప్పటి వరకు పార్టీకి ఫరూఖ్ అబ్దుల్లానే చీఫ్‌గా ఉంటారు.
జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఫరూఖ్ అబ్దుల్లా వైదొలిగే నిర్ణయం తీసుకున్నట్టు తన కొలీగ్స్‌కు ఆయన వెల్లడించారని జేకేఎన్‌సీ ఓ ట్వీట్‌లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని సీనియర్ పార్టీ నేతల విజ్ఞప్తి చేసినా అందుకు ఫరూఖ్ అబ్దుల్లా విముఖంగానే ఉన్నట్టు వారు వివరించారు.
పార్టీకి కొత్త చీఫ్‌ను ఎన్నుకునే వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని మరో ట్వట్‌లో తెలిపారు. గతంలో ఫరూఖ్ అబ్దుల్లా జమ్ము కశ్మీర్ సీఎంగా చేశారు.