రేపు పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం... హాజరుకానున్న నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు

By Siva KodatiFirst Published Sep 28, 2022, 4:54 PM IST
Highlights

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రేపు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. దీనికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ అధికారులు హాజరుకానున్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌పై రేపు నాలుగు రాష్ట్రాల అధికారులు సమావేశం కానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ , కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాల అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేపు ఉదయం వర్చువల్‌గా సమావేశం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపు ముప్పు వుండదనే అంశాన్ని వివరించడానికి సిద్ధమైంది సీడబ్ల్యూసీ, పీపీఏ.. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మాత్రం వుండదని మరోసారి ఈ సమావేశంలో స్పష్టం చేయడానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. 

కాగా... పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ నెల 6న విచారణ జరిగిన సంగతి తెలిసిందే. పోలవరం నిర్మాణంతో తమ రాష్ట్రాలకు ముప్పు పెరిగిందంటూ తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్‌లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తి శాఖను నివేదిక కోరింది. ప్రాజెక్ట్ పర్యావరణ అంశాలను పరిశీలించాలని జలశక్తి శాఖను ఆదేశించింది. అభ్యంతరాలపై ముఖ్యమంత్రులు, సీఎస్‌ల స్థాయిల్లో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ ఏడుకు వాయిదా వేసింది. 

ఇకపోతే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో భద్రాచలం పరిధిలోని పలు మండలాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి క్లౌడ్ బరెస్ట్ అని కేసీఆర్ అంటే.. కాదు పోలవరం వల్లేనని కొందరు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం దీనికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య వాతావరణం వేడెక్కింది. పోలవరం విలీన మండలాలను తెలంగాణలో కలపాలని పలువురు వాదిస్తున్నారు. దీనికి ఏపీ మంత్రులు, నేతలు ఘాటుగా కౌంటరిస్తున్నారు. 

ALso Read:పోలవరంపై ఎన్జీటీ తీర్పుపై సుప్రీంలో జగన్ సర్కార్ సవాల్: అన్ని పిటిషన్లను విచారిస్తామన్న కోర్టు

ఇదిలావుండగా.. పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ జూలై 30న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కు లేఖ రాశారు. ఏపీలో కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రచలానికి పెనుముప్పు ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఈఎన్సీ లేఖలో విజ్ఞప్తి చేశారు. బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడే పరిస్ధితులు, ప్రభావాలపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని కూడా తెలంగాణ ఈఎన్సీ కోరారు. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీరు నిల్వ వుంటే భద్రాచలం ప్రాంతానికి ముప్పు మరింత పెరుగుతుందని.. మున్నేరువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని పేర్కొన్నారు. రక్షణ కట్టడాలు నిర్మించి, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఇదిలావుండగా.. పోలవరం బ్యాక్ వాటర్.. భద్రాచలం, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయని.. మొత్తంగా 90 గ్రామాలకు ఇది పెద్ద సమస్యగా మారుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. అందువల్ల గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ సహా.. పరిష్కారం కోసం అన్ని మార్గాల్లో పోరాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అదే సమయంలో న్యాయపరమైన అవకాశాలను కూడా తెలంగాణ సర్కార్ అన్వేషిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించడానికి కేంద్రం సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 
 

click me!