ఢిల్లీలో పేలుడు మా పనే... జైషే ఉల్‌ హింద్‌ సంస్థ ప్రకటన..?

By Siva KodatiFirst Published Jan 30, 2021, 4:04 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన బాంబు పేలుళ్లు తమ పనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్. ఇందుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు సోషల్ మీడియాలో జరిగిన ఛాటింగ్‌ను గుర్తించినట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన బాంబు పేలుళ్లు తమ పనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్. ఇందుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు సోషల్ మీడియాలో జరిగిన ఛాటింగ్‌ను గుర్తించినట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి.

ఈ బాంబు దాడికి సదరు ఉగ్రవాద సంస్థ గర్విస్తున్నట్లుగా ఈ ఛాటింగ్‌లో గుర్తించారు. కాగా, నిన్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తు బృందం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు జరిగిన స్థలాన్ని సందర్శించి మరిన్ని ఆధారాలు సేకరించింది.

తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీలో ఉపయోగించిన రసాయన సమ్మేళనాన్ని ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. ఇప్పటికే ఎన్ఐఏ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ పర్యవేక్షిస్తున్నారు.

అయితే పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని ప్రభుత్వం తెలిపింది. హిజ్బుల్‌ వంటి ఉగ్రవాద సంస్థలేవీ ఇంకా ప్రకటనలు చేయలేదని పేర్కొంది. ప్రస్తుత సమాచారంతో ఇరాన్‌పై అధికారికంగా ఆరోపణలు చేయలేమని తెలిపింది. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చాక కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.  

Also Read:ఢిల్లీ పేలుళ్లు: రంగంలోకి ఇజ్రాయెల్ టీమ్ .. ఘటనా స్థలిలో పరిశీలన

దేశ రాజధాని నడిబొడ్డులో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అదే సమయంలో ఘటనాస్థలానికి 1.5కిలోమీటర్ల దూరంలోని విజయ్‌ చౌక్‌లో గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమం జరిగింది. అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి అగ్రనేతలు పాల్గొన్నారు.

అలాంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో పేలుడు సంభవించడంతో దేశం ఉలిక్కిపడింది. మరోవైపు ఘటనాస్థలానికి కొంత దూరంలో ఓ లేఖను గుర్తించినట్లు సమాచారం. అందులో ‘‘ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే’’ అని కూడా రాసి ఉన్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు పోలీసులు. దానిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్థదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ప్రైవేట్ క్యాబ్‌లో వచ్చినట్లుగా గుర్తించిన అధికారులు.. క్యాబ్ డ్రైవర్‌ను ప్రశ్నించనున్నారు. మరోవైపు భారత దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం వుందన్నారు ఇజ్రాయెల్ ప్రతినిధి. 
 

click me!