
Jabalpur Fire: మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని దామోహ్ నాకా ప్రాంతంలో ఉన్న న్యూ లైఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మరణించారు. ఘటనా స్థలంలో పలు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రినిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. ఈ ఘటనపై జబల్‌పూర్ జిల్లా కలెక్టర్ అల్లయ్య రాజా మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 10 మంది మరణించినట్లు ధృవీకరించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఎటు వ్యాపించకుండా అక్కడికక్కడే ఆర్పివేసినట్టు తెలుస్తుంది.
ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. సీఎం చౌహాన్ ట్వీట్ చేస్తూ.. జబల్‌పూర్‌లోని ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం విచారకరం. స్థానిక అధికారులు, కలెక్టర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాను. మొత్తం వ్యవహారంపై నిఘా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను. సహాయం, రక్షణ కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అని ట్వీట్ చేశారు.
అలాగే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జబల్‌పూర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించారు.
సిఎం శివరాజ్ మరో ట్వీట్ చేస్తూ.. 'ఈ దుఃఖ సమయంలో మరణించిన కుటుంబం తమను తాము ఒంటరిగా భావించకూడదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. క్షతగాత్రుల పూర్తి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అని ట్వీట్ చేశారు.
మరోవైపు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ కూడా ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు. కమల్ నాథ్ ట్వీట్ చేస్తూ.. 'జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం కారణంగా చాలా మంది మరణించారు. చాలా మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అని ట్వీట్ చేశారు.