
JABALPUR FIRE ACCIDENT: మధ్యప్రదేశ్ లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబల్‌పూర్‌లోని గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోహ్ నాకా సమీపంలోని న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. స్థానికుల ద్వారా ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ప్రమాదం గల కారణాలు తెలియరాలేదు. ప్రమాద సమయంలో ఎంత మంది ఆసుపత్రిలో ఉన్నారనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మరికొంత మంది మంటల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.
ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధార్థ్ బహుగుణ మీడియాతో మాట్లాడుతూ.. జబల్‌పూర్‌లోని గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోహ్ నాకా సమీపంలోని న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. ఆసుపత్రిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ప్రాంతంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.