మనం కలిసి ఉండటం కలేనా:కశ్మీర్ పోలీస్ భార్య భావోద్వేగపు పోస్ట్

By rajesh yFirst Published Sep 3, 2018, 3:59 PM IST
Highlights

శాంతిభద్రతలను కాపాడటమే వారి లక్ష్యం. ప్రజారక్షణే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించడం వారి విధి నిర్వహణ. శత్రువుల రూపంలో మృత్యువు తరుముకొస్తున్నా ఎదురొడ్డి నిలబడటం వారి సాహసం.  కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. వాళ్లే పోలీసులు. ఇక కల్లోల కశ్మీరంలో అయితే పోలీసుల ధైర్యసాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 


శ్రీనగర్‌: శాంతిభద్రతలను కాపాడటమే వారి లక్ష్యం. ప్రజారక్షణే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించడం వారి విధి నిర్వహణ. శత్రువుల రూపంలో మృత్యువు తరుముకొస్తున్నా ఎదురొడ్డి నిలబడటం వారి సాహసం.  కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. వాళ్లే పోలీసులు. ఇక కల్లోల కశ్మీరంలో అయితే పోలీసుల ధైర్యసాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 

నిత్యం ఉగ్రమూకల తూటాలకు ఎదురొడ్డి పోరాడాల్సిందే. ఏక్షణాన ఏ ఉగ్రమూక దాడిచేస్తుందోనని నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడే  పోలీసులను బెదిరించేందుకు ఉగ్రవాదులు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులను కిడ్నాప్‌ చేసి హత్యలు చేయడం, వారి బంధువులను ఎత్తుకెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జమ్ము కశ్మీర్ లో ఇటీవల కొందరు పోలీసుల బంధువులను ముష్కరులు ఎత్తుకెళ్లారు. 

ఈ నేపథ్యంలో విధులు నిర్వహిస్తోన్న ఓ పోలీసు భార్య సోషల్‌మీడియాలో భావోద్వేగపు పోస్టు చేశారు. ఆరిఫా తౌసిఫ్ అనే మహిళ ప్రజల కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలను తన మాటల్లో ఉద్వేగంగా రాసుకొచ్చారు.

 పోలీసుల భార్యలకు భర్తలతో కలిసుండటం అనేది సుదూర తీరాల్లో ఉన్న ఓ కల. మా జీవితమంతా వారి కోసం ఎదురుచూడటమే. ఏ రోజైనా కలిసి భోజనం చేయకపోతామా, కలిసి పండుగలు, వేడుకలు జరుపుకోకపోతామా అని ఎదురుచూస్తూనే ఉంటాం. కానీ, అది ఎప్పటికో గానీ జరగదు. అందుకే మేం పేరుకు ఇద్దరమైనా, ఒంటరిగానే బతకాలి. మాలో చాలా మంది మా పిల్లలను ఒంటరిగానే పెంచుతున్నాం. అలాంటి సమయంలో వారికి ఎన్నో అబద్ధాలు చెబుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

నాన్న ఈ శనివారం ఇంటికొస్తాడు కన్నా. ఈ పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌కు తప్పకుండా స్కూలుకు వస్తాడు. ఈ ఆదివారం మనమంతా కలిసి పిక్నిక్‌కు వెళ్దాం.. అంటూ అబద్ధాలు చెప్పుకొస్తున్నాం. కొడుకు కోసం ఎదురుచూస్తున్న మా అత్తామామలకు కూడా ఇలాగే చెబుతూ వస్తున్నాం. మీ అబ్బాయి ఈ పండుగకు వస్తాడు.. ఆ పెళ్లికి వస్తానన్నాడు అంటూ వారిని ఆనందపరుస్తున్నాం. అలా చెబుతూ చెబుతూ చివరకు మాకు మేమే అబద్ధాల్లో బతికేస్తున్నాం అంటూ తన బరువెక్కుతున్న గుండెల్లోని బాధను రాసుకొచ్చారు.

ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇలా భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంటున్నాం. విధి నిర్వహణలో మా భర్తలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అభద్రతా భావంలోనే బతుకుతున్నాం. రోజురోజుకి వారికి ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలో ఆ పోలీసు అధికారికి జరిగింది. రేపు నా భర్తకు కూడా జరుగుతుందేమోనన్న భయం క్షణక్షణం వెంటాడుతోంది. అలా భయపడుతూ నిద్రలో ఉలిక్కిపడితే కనీసం వెన్నుతట్టే వారు కూడా ఉండనంతా ఒంటరి స్థితిలో ఉన్నాం అంటూ ఆరిఫా తౌసిఫ్‌ అనే మహిళ తన ఆవేదన వెళ్లగక్కారు.

కశ్మీర్‌లో శాంతిభద్రతలు నానాటికీ తగ్గిపోతున్నాయని.. ఎందరో పోలీసులు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని ఆరిఫా ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడం పోలీసులతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. కశ్మీర్ లో శాంతిని నెలకొల్పడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే  తమలాంటి వారు భరోసాగా ఉంటారని తన పోస్టును ముగించారు. 

ఆరిఫా తౌసిఫ్ చేసిన ఈ పోస్టు అందర్నీ కలచివేస్తుంది. ఈ పోస్టును చదివిని ప్రతీ ఒక్కరి మనసు చలించిపోతుంది. ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా ధైర్యంగా ఉండే పోలీస్ వారి కుటుంబాల్లో ఇంతటి ఆవేదన ఉంటుందా అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.  

click me!