ట్రంప్‌ కుడి ఎడమలు: అగ్రదేశాధినేతను నడిపిస్తున్న కూతురు, అల్లుడు

By Siva KodatiFirst Published Feb 24, 2020, 6:49 PM IST
Highlights

ఒక వ్యక్తి గొప్ప విజయాలు సాధించడం వెనుక అతని కుటుంబం పాత్ర మరువలేనిది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్ సైతం ఆయన వెనుక ఇలాంటి పాత్రే పోషిస్తున్నారు. 

ఒక వ్యక్తి గొప్ప విజయాలు సాధించడం వెనుక అతని కుటుంబం పాత్ర మరువలేనిది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్ సైతం ఆయన వెనుక ఇలాంటి పాత్రే పోషిస్తున్నారు.

ట్రంప్ ముక్కసూటి మనిషి.. మనసుకు నచ్చింది, నోటికి వచ్చింది ఏ మాత్రం ఆలోచించకుండా అనేస్తారు. అందుకే భార్యాభర్తలిద్దరూ అధ్యక్షుడిపై ఓ కన్నేసి వుంచుతారు. కూతురు ఇవాంకా అంటే ఆయనకు ఎంతో ప్రేమ. వ్యాపారవేత్తగా, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతి కుమారుడు కుష్నర్‌‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

2016లో ట్రంప్ అధ్యక్ష బరిలో నిలిచిన సమయంలో ట్రోలింగ్, సెంటిమెంట్ రెచ్చగొట్టడం వంటి వ్యవహారాలను కుష్నర్ దగ్గరుండి చూసుకున్నారు. ఇక ట్రంప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఇవాంక సమర్థవంతంగా తిప్పికొట్టి తండ్రికి అండగా నిలిచారు.

Also Read:వాహ్ తాజ్: ముగ్ధులై, ఫోటోలు దిగిన ట్రంప్ దంపతులు

అందుకే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే తన కార్యనిర్వహక బృందంలో ఇవాంక, కుష్నర్‌లను సలహాదారులుగా నియమించారు. అయితే ఆయన బంధుప్రీతి ఆరోపణలపై ప్రతపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.

ఇక అదే సమయంలో ట్రంప్ ఉత్తరకొరియా పర్యటన, జీ20 శిఖరాగ్ర సమావేశం వంటి కీలక పర్యటనలకు ఇవాంక తండ్రి వెంటే ఉండేవారు. ట్రంప్, మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే వీడియోను పోస్ట్ చేసిన ఇవాంక భారతీయుల మనసు గెలుచుకున్నారు. అయితే అదే సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని, ఐఎంఎఫ్ చీఫ్‌లతో చర్చలు జరపడం విమర్శలకు దారి తీసింది.

ట్రంప్ సలహాదారు హోదాలో 2017లో భారత పర్యటనకు వచ్చిన ఇవాంక హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇవాంక భర్త కుష్నర్ విషయానికి వస్తే.. మధ్యప్రాచ్చం, అరబ్ దేశాల వ్యవహారాలను దగ్గరుండి చూసుకునేవారు. ఇటీవల ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరిగిన శాంతి ఒప్పందం వెనుక కుష్నర్ వ్యూహ చతురత ఉంది. యూదుడైన కుష్నర్ ఇజ్రాయిల్‌కు పక్షపాతిగా ఉంటారని విమర్శలు ఎదుర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య వెనుక సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారని సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో ట్రంప్.. సల్మాన్‌కు అండగా నిలబడ్డారు. కుష్నర్‌కు సల్మాన్‌తో ఉన్న సంబంధాలే దీనికి ప్రధాన కారణమని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి.

అధ్యక్షుడి అధికారాల్లో ముఖ్యమైన క్షమాభిక్ష అధికారాన్ని కొద్దిరోజుల క్రితమే కుష్నర్‌కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాస్ చేసిన క్రిమినల్ జస్టిస్ బిల్లు వెనుక ఆయన ఎంతో కృషి చేశారు.

Also Read:ట్రంప్ తాజ్ పర్యటన: ఆ ప్రేమ చిహ్నం గురించి వివరిస్తున్న ఆ గైడ్ ఎంపిక ఎలా జరిగిందంటే...

మరోవైపు భారతదేశం విషయంలో కుష్నర్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఆయన కాలేజీ రోజుల్లో భారతీయులతో కలిసి చదువుకున్నారు. 2018లో తన సహ విద్యార్ధి నితిన్ సైగల్ వివాహం నిమిత్తం కుష్నర్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వచ్చారు.

కుష్నర్‌కు భారతీయ సంస్కృతిపై అవగాహన ఉంది. భారత్‌ను ఆయన వ్యూహాత్మక, వ్యాపార భాగస్వామిగా కుష్నర్ భావిస్తున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌కు బలంగా ఉన్న గ్రామీణ ఓటు బ్యాంక్‌ కోసం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లో మార్కెట్‌ ద్వారాలు తెరిపించేందుకు కుష్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం మీద కూతురు, అల్లుడు సహకారంతో ట్రంప్ అమరికాను నిరాటంకంగా ఏలేస్తున్నారు. 

click me!