వాహ్ తాజ్: ముగ్ధులై, ఫోటోలు దిగిన ట్రంప్ దంపతులు

By telugu teamFirst Published Feb 24, 2020, 6:24 PM IST
Highlights

తాజ్ మహల్ సౌందర్యానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ముగ్ధులయ్యారు. గంటసేపు తాజ్ మహల్ వద్ద గడిపారు. తాజ్ మహల్ సౌందర్యంపై ట్రంప్ విజిటర్స్ బుక్ లో రాసి సంతకం చేశారు. 

ఆగ్రా: సూర్యాస్తమయ సమయంలో ఆగ్రాలోని తాజ్ మహల్ ను చూసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు ముగ్ధులయ్యారు. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ దాదాపు గంట సేపు తాజ్ మహల్ వద్ద గడిపారు. గైడ్ దాని ప్రాశస్త్యాన్ని వివరిస్తుంటే శ్రద్దగా ఆలకించారు. 

ట్రంప్ దంపతులతో పాటు వారి కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జరేద్ కుష్నర్ ఉన్నారు. అమెరికా ఉన్నతాధికారులు కూడా వారితో పాటు ఆగ్రాకు వచ్చారు. గైడ్ సాయంతో తాహ్ మహల్ ను తిలకిస్తూ ట్రంప్ దంపతులు చేతిలో చేయి వేసి తిరుగారు.  విజిటర్స్ బుక్ లో ట్రంప్ సంతకం చేశారు.

 

తాజ్ మహల్ అద్భుత స్ఫూర్తి ప్రదాత అని, భారత సంస్కృతిలోని వైవిధ్య సౌందర్యానికి కాలాతీతమైన చిహ్నమని, థాంక్యూ ఇండియా అని విజిటర్స్ బుక్ లో రాశారు. అహ్మదాబాద్ లో రోడ్ షో, సబర్మతీ ఆశ్రమ సందర్శన, నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగం వంటి తీరిక లేని కార్యక్రమాల్లో పాల్గొన్న ట్రంప్ దంపతులు తాజ్ మహల్ పై విశేషమైన ఆసక్తిని ప్రదర్శించారు.   తాజ్ మహల్ వద్ద ట్రంప్ దంపతులు ఫొటోలు దిగారు. 

తాజ్ మహల్ ను ఇప్పటి వరకు 40 మందికి పై విదేశీ ప్రముఖులు సందర్శించారు. వారిలో ప్రిన్సెస్ డయానా, డ్యూక్ ఆప్ కేంబ్రిడ్జీ ప్రిన్స్ విలియమ్ ఆయన సతీమణి, కేట్ మిడిల్ టన్ తదితరులు ఉన్నారు. 

విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. వారికి జానపద కళా ప్రదర్శనలతో స్వాగతం పలికారు.  తాజ్ మహల్ కు ట్రంప్ వెళ్తున్న దారిలో అమెరికా, ఇండియా జెండాలను చేబూని దారి వెంట విద్యార్థులు బారులు తీరారు. 

click me!