
దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. దేశ సరిహద్దుల్లోని మంచుకొండల్లో నిత్యం పహారా కాస్తూ దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (Indo-Tibetan Border Police)కి చెందిన సైనికులు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీరిని హిమవీరులుగా కూడా పిలుస్తారు. నేడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మంచుతో నిండిన లడఖ్ సరిహద్దుల్లో మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో.. సముద్రమట్టానికి 15,000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఐటీబీపీ జవాన్లు వేడుకను నిర్వహించారు.
ఎముకలు కొరికే చలిలో జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించిన వీడియోను ఐటీబీపీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దళానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన సైనికుడు త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని కవాతు చేశారు. ఈ సందర్భంగా జవాన్లు భారత్ మాతా కీ జై, ఐటీబీపీ కీ జై అంటూ జవాన్లు నినాదాలు చేశారు.
మరోవైపు ఐటీబీపీ దళాలు ఉత్తరాఖండ్ ఔలీలో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించాయి. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 11 వేల అడుగుల ఎత్తులో స్కేటింగ్ చేస్తూ ఆశ్చర్యపరిచాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1962లో ఉద్భవించిన.. ITBP అనేది ఒక ప్రత్యేకమైన పర్వత దళం. ఇక్కడ అధికారులు పర్వతారోహకులు, స్కీయర్‌లకు శిక్షణనిస్తారు. లడఖ్‌లోని కారకోరం పాస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జాచెప్ లా వరకు 3,488 కిలోమీటర్ల సరిహద్దులో ఐటీబీపీ జవాన్లు కాపలాగా ఉన్నారు