
మైసూరు : పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కర్ణాటకలో మరోసారి అధికారాన్ని చేపట్టి దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని మరింత పెంచుకోవాలని బిజెపి... ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ రెండు పార్టీలకు ప్రాంతీయ పార్టీ జేడిఎస్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ కర్ణాటకలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే మరో వారంరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్ని డబ్బుల పంపిణీకి సిద్దమవగా... ఈ ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.
దక్షిణ కన్నడ జిల్లాలో పుత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ అశోక్ రాయ్ సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో భారీగా నగదు దాచినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు మైసూరులోని సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో ఇవాళ(బుధవారం) సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎంతవెతికానా డబ్బులేమీ దొరక్క పోవడంతో చేసేదేమి లేక బయటకు వచ్చారు ఐటీ అధికారులు.
అయితే ఆ ఇంటి ఆవరణలో ఓ మామిడి చెట్టుపై ఓ బాక్స్ ను అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి చెట్టుపైనుండి ఆ బాక్స్ ను కిందకుదించి చూసిన ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు. కోటీ రూపాయల నగదును ఇలా బాక్స్ లో వుంచి ఎవరికీ అనుమానం రాకుండా చెట్టుపై పెట్టారు. ఆ నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read More బజరంగ్‌దళ్‌పై నిషేధమంటూ కాంగ్రెస్ హామీ.. ఆ వాగ్దానాన్ని గుర్తుచేస్తూ అసదుద్దీన్ ఫైర్..
ఇలా డబ్బులు చెట్లకు కాస్తున్నాయేమో అన్నట్లుగా కర్ణాటకలో విచ్చలవిడిగా ధనప్రవాహం జరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.302 కోట్ల లెక్కాపత్రం లేని నగదుతో పాటు ఓటర్లకు పంచేందుకు సిద్దంచేసిన బహుమతులను పోలీసులకు చిక్కాయి. రాజధాని బెంగళూరులోనే రూ.82 కోట్లు పట్టుబడినట్లు ఈసీ తెలిపింది.
గత నెల బెంగళూరులో ఇలాగే సామాన్యుల మాదిరి ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరిపై అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. వారివద్ద గత బ్యాగులను తెరిచిచూడగా నోట్ల కట్టలు బయటపడ్డారు. మొత్తం కోటి రూపాయల నగదును ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.