
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా న్యాయవాది డాయన్ క్రిష్ణ ఈ రోజు కోర్టులో దర్యాప్తు సంస్థల తీరుపై మండిపడ్డారు. చట్టానికి లోబడి నడుచుకోకుండా అరెస్టులు చేయడం నేడు దర్యాప్తు సంస్థలకు ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. అరెస్టులు చేయడం తమ హక్కు అని భావిస్తున్న దర్యాప్తు సంస్థలను కోర్టులు హద్దులో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను ప్రశ్నించడానికి పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టును కోరింది. ఈడీ విజ్ఞప్తిని అంగీకరిస్తూ మనీశ్ సిసోడియాకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
సీబీఐ ఓ అస్పష్టమైన అఫెన్స్‌ను విచారిస్తున్నదని లాయర్ క్రిష్ణ అన్నారు. ఈ రోజు ఈడీ తెలిపిన విషయాలు అన్నీ సీబీఐ కేసు మాదిరిగానే ఉన్నాయని తెలిపారు. అసలు ఈడీ స్వతహాగా ఎలాంటి విచారణ చేయలేదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించరాదని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఫైల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకూ పంపించారని, ఆయన ఆమోదించారు కూడా అని న్యాయవాది గుర్తు చేశారు. కాబట్టి, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా ఈడీ ప్రశ్నిస్తుందని తాను భావిస్తున్నట్టు వివరించారు.
Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియాకు ప్రత్యక్ష పాత్ర ఉన్నది: కోర్టులో ఈడీ
మనీశ్ సిసోడియాను పది రోజుల కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో డబ్బుల వ్యవహారం ఎక్కడి దాకా తీసుకెళ్లుతుందో అక్కడి వరకు వెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో కనీసం రూ. 292 కోట్ల నేరం ఉన్నదని ఈడీ ఆరోపించింది.
తాము కొందరు అధికారులకూ సమన్లు పంపించామని, కస్టడీలో సిసోడియాతో ఎదురెదురుగా వారిని విచారించాలని భావిస్తున్నట్టు ఈడీ తెలిపింది.