ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును న్యూరెంబర్గ్ మాడల్‌లో ఎలాంటి విచారణ చేపట్టకుండానే కాల్చి చంపేయాలని కాంగ్రెస్ ఎంపీరాజమోహన్ ఉన్నిథన్ అన్నారు. కేరళలో పాలస్తీనా వాసులకు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాజమోహన్ ఉన్నిథన్ శనివారం షాకింగ్ కామెంట్లు చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అనేక యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడని, నెతన్యాహును విచారించకుండానే తుపాకీతో కాల్చి చంపేయాలని అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అమానుషమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఎంపీ రాజమోహన్ ఉన్నిథన్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
పాలస్తీనా వాసులకు సంఘీభావంగా కేరళలోని కాసర్‌గోడ్‌లో ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ రాజమోహన్ ఉన్నిథన్ మాట్లాడారు. బహిరంగంగానే న్యూరెంబర్గ్ మాడల్‌కు ఆయన మద్దతు ఇచ్చారు.
Also Read: Bangles: మంచి గాజులు వేసుకుందని భార్యను బెల్ట్‌తో చితకబాదిన భర్త
‘జెనీవా కన్వెన్షన్‌లోని ఒప్పందాలు అన్నింటినీ ఉల్లంఘించిన వారిని ఏం చేయాలని మీరు నన్ను అడగవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్ మాడల్ అనే ఒక విధానం ఉండేది. యుద్ధ నేరాలకు పాల్పడిన నాజీలను శిక్షించడానికి ఈ విధానాన్ని ఉపయోగించేవారు. ఈ విధానం ప్రకారం, యుద్ధ నేరాలకు పాల్పడిన ఆరోపణలున్న వారిపై ఎలాంటి విచారణ లేకుండానే షూట్ చేసి చంపేసేవారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానిపైనా ఈ విధానాన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. పాలస్తీనాలో ఆయన బలగాలు చేస్తున్న దాష్టీకాలకు నెతన్యాహును కాల్చి చంపాల్సిందే’ అని వ్యాఖ్యలు చేశారు.