
మణిపూర్‌లో చెలరేగిన హింస ఆగడం లేదు. గత ఐదు నెలలుగా రాష్ట్రంలో గందరగోళ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో హింస చెలరేగడంతో మొబైల్ ఇంటర్నెట్‌ను నిషేధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను సరిదిద్డడానికి, తప్పుడు పుకార్లు, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా బుధవారం మణిపూర్ ప్రభుత్వం మరోసారి మొబైల్ డేటా ఇంటర్నెట్ సేవలను 5 రోజుల పాటు నిషేధించింది.
ఇంటర్నెట్ సేవల నిషేధం అక్టోబర్ 16 సాయంత్రం వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. మణిపూర్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. హింసాత్మక కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యతిరేక, సంఘవ్యతిరేక శక్తుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు, శాంతి, మత సామరస్యాన్ని కాపాడేందుకు, ప్రాణనష్టాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంటర్నెట్ సేవలపై పలు మార్లు నిషేధం విధించబడింది. హోం శాఖ తరపున ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటన తర్వాత సెప్టెంబర్ 23న దీనిని పునరుద్ధరించడం గమనార్హం. అయితే.. తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు వైరల్ కావడంతో ఇంఫాల్ లోయలో మరోసారి ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ముందుజాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 26న మళ్లీ నిషేధం విధించారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారకుండా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం మళ్లీ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది.