
Prayagraj Kumbhmela 2025: యోగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో గురువారం 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల బృందం సంగమంలో పవిత్ర స్నానం చేసింది. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ అండ్ పబ్లిక్ డిప్లమసీ విభాగం ఆహ్వానం మేరకు 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల బృందం బుధవారం వచ్చింది. ఈ బృందానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన అరైల్ ప్రాంతంలోని టెంట్ సిటీలో వసతి ఏర్పాటు చేశారు.
బుధవారం ఈ బృందం మహాకుంభమేళా ప్రాంతాన్ని సందర్శించింది. సాయంత్రం 5:00 నుంచి 6:30 వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు ప్రయాగ్‌రాజ్ సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పరిశీలించారు. రాత్రికి టెంట్ సిటీలో భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు.
ఈ అంతర్జాతీయ బృందం ఇవాళ గురువారం (జనవరి 16న) ఉదయం 8:00 గంటలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. తర్వాత ఉదయం 9:30 గంటలకు బృంద సభ్యులకు హెలికాప్టర్ ద్వారా మహాకుంభ్ ప్రాంతాన్ని చూపించారు. ఈ పర్యటన మధ్యాహ్నం 1:30 గంటలకు ముగిసింది. ఆ తర్వాత బృందం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లిపోయింది.