ఇజ్రాయెల్‌ పౌరుల్ని టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు.. భద్రత పెంచండి: ఢిల్లీ పోలీసులకు ఐబీ హెచ్చరిక

By Siva KodatiFirst Published Sep 4, 2021, 7:19 PM IST
Highlights

జనవరి 29న ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులను ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. 

ఢిల్లీలో ఉగ్రదాడి జరిగే అవకాశం వుందని కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) శనివారం కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. జనవరి 29న ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది.

ఈ నెల 6న ఇజ్రాయెల్‌ పౌరుల సెలవులు ప్రారంభం కానున్నందున వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌ సిబ్బంది, వారి నివాసాలు, కోషెర్‌ రెస్టారెంట్‌, చాబాద్‌ హౌస్‌, యూదుల కమ్యూనిటీ సెంటర్‌ వంటి ప్రాంతాల్లో  వచ్చే నెలాఖరు వరకు భద్రతను పెంచాలని ఐబీ హెచ్చరించింది.  అలాగే ఇజ్రాయెల్‌ పౌరుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా వున్న పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్టు ఐబీ తెలిపింది. 
 

click me!