Taliban: పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయంటే.. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ భిన్నమైన వివరణ

Published : Sep 04, 2021, 06:01 PM IST
Taliban: పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయంటే.. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ భిన్నమైన వివరణ

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సంక్షోభం కారణంగానే చమురు ధరలు పెరుగుతున్నాయని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభంతో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని, అందుకే ధరలు పెరుగుతున్నాయని భిన్నమైన వివరణ ఇచ్చి వార్తలకు ఎక్కారు. అయితే, ఈ కారణాలను తెలుసుకునే పరిణతి ప్రజలకు ఉన్నదనీ ముక్తాయింపునిచ్చారు.

బెంగళూరు: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సహా కేంద్ర ప్రభుత్వమూ చమురు ధరలపై వేడిని ఎదుర్కోవలసి వస్తున్నది. కేంద్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఇందుకు కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం కంపెనీలకు జారీ చేసిన ఆయిల్ బాండ్ల కారణంగా చమురు ధరలు తగ్గించడం సాధ్యం కావడం లేదని ఆమె వివరించారు. కాగా, రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం వారికి తోచిన వివరణలు ఇస్తున్నారు. తాజాగా, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ ఇంధన ధరల పెరుగుదలకు తాలిబాన్లు కారణమని వివరించి వార్తల్లోకెక్కారు.

‘ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సంక్షోభం కారణంగానే క్రూడ్ ఆయిల్ సరఫరాలు క్షీణించాయి. ఆ కారణంగానే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలకు గల కారణాలను అర్థం చేసుకునే పరిణతి ప్రజల్లో ఉన్నది’ అని వివరించారు.

క్రూడాయిల్ దిగుమతిదారుల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉన్నది. కానీ, ముడి చమురు అమ్ముతున్నదేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న టాప్ ఆరు దేశాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, యూఎస్, కెనడాలున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లోని సంక్షోభ పరిస్థితులూ చమురు ధరలను ప్రభావితం చేయగలవు. కానీ, వాటి ప్రభావాన్ని ఇప్పుడే చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ఇప్పటికీ తాలిబాన్లు, వారి ప్రభుత్వంతో వ్యవహరించడంపై అప్రమత్తంగానే ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం