మహారాష్ట్ర మంత్రి ముఖంపై ఇంక్ దాడి.. అంబేద్కర్, ఫూలేలపై కామెంట్లతో ఆగ్రహం!(వీడియో)

By Mahesh KFirst Published Dec 11, 2022, 1:15 PM IST
Highlights

మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ పై ఓ వ్యక్తి ఇంక్ విసిరాడు. దళిత మహాపురుషులు అంబేద్కర్, మహాత్మా ఫూలేలపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.
 

ముంబయి: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ పై ఓ వ్యక్తి ఇంక్ విసిరేశాడు. ఆయన ఓ భవంతి నుంచి బయటకు వస్తుండగా మందిలో నుంచి హఠాత్తుగా ముందుకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. మంత్రి ముఖంపై ఇంక్ విసిరేశాడు. అంతకు ముందు రోజు మంత్రి చంద్రకాంత్ పాటిల్ దళిత ఐకాన్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలేలపై కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు తప్పుగా అర్థం చేసుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.

ఔరంగాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడారు. మరాఠీలో మాట్లాడుతూ విద్యా సంస్థల కోసం  అంబేద్కర్, ఫూలే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అడగ లేదని అన్నారు. కానీ, పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించడానికి వారు ప్రజలే ఫండ్స్ కూడబెట్టాలని అడిగార(బెగ్‌డ్)ని తెలిపారు. ఇక్క ఆయన అడుక్కున్నారనే పదాన్ని వాడటం వివాదాస్పదం అయింది. 

మంత్రి చంద్రకాంత్ పాటిల్ శనివారం పింప్రీ సిటీకి వచ్చారు. ఓ భవనం నుంచి ఆయన బయటకు వస్తుండగా ఓ వ్యక్తి మంత్రి ముఖంపై ఇంక్ విసిరాడు. 

Also Read: ‘హిందూ దేవుళ్లను పూజించను’.. బౌద్ధ కార్యక్రమంలో ఆప్ మంత్రి ప్రతిజ్ఞ.. వివాదం రేపిన వీడియో

కాగా, మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ ఇంక్ దాడితో తాను గాయపడలేదని, బాధపడలేదని వివరించారు.‘డాక్టర్ అంబేద్కర్, మహాత్మా ఫూలేను నేను ఎప్పుడు విమర్శించా? స్కూల్స్ స్టార్ట్ చేయడానికి వారు ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురుచూడలేదని, ప్రజలను డబ్బులు అడిగి వాటిని మొదలు పెట్టారని నేను అన్నాను. ఎవరైనా కోర్టులో ఐ బెగ్ ఫర్ జస్టిస్ అంటే.. అక్కడ భీక్ (అడుక్కోవడం) తప్పు అని చెప్పగలరా? ఇంక్ చల్లినందుకు పోయేదేమీ లేదు. నేను నా షర్ట్ మార్చుకున్నా.. వెళ్లిపోతున్నా’ అని మంత్రి వివరణ ఇచ్చారు.

| Ink thrown at Maharashtra cabinet minister Chandrakant Patil in Pimpri Chinchwad city of Pune district, over his remark on Dr BR Ambedkar and Mahatma Jyotiba Phule. pic.twitter.com/FBRvRf2K4g

— ANI (@ANI)

దీనిపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. ‘ఇది చాలా బాధాకరమైన విషయం. చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యల అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లేదా డాక్టర్ కర్మవీర్ భావురావ్ పాటిల్‌లు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకుని ఇన్‌స్టిట్యూషన్‌లను నడుపలేదని చెప్పారు’ అని తెలిపారు.

మహారాష్ట్ర పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ పోలీసు శాఖ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. మంత్రికి రక్షణాలోపం కారణంగా వారిపై వేటు వేసింది. అయితే, తన భద్రతా లోపానికి ఏ పోలీసు అధికారిపైనా యాక్షన్ తీసుకోవద్దని ఆయన రాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మంత్రి చంద్రకాంత్ పాటిల్ కోరారు.

click me!