బీజేపీ వీఐపీ ఆకతాయిలు : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను తెరిచింది తేజస్వి సూర్యనే.. కాంగ్రెస్

By SumaBala BukkaFirst Published Jan 18, 2023, 1:34 PM IST
Highlights

గత నెలలో చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనుకోకుండా తెరిచిన ప్రయాణికుడు బీజేపీ యువమోర్చా చీఫ్ తేజస్వి సూర్య అని పలు నివేదికలు పేర్కొన్నాయి.

బెంగళూరు : గత నెలలో చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానం టేకాఫ్ కు ముందు ప్రమాదవశాత్తూ విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరిచిన ఆ ప్రయాణికుడు బీజేపీ యువమోర్చా చీఫ్‌ తేజస్వి సూర్య అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం బెంగళూరు సౌత్ ఎంపీపై విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఈ ఘటనను ప్రభుత్వం ఇంత కాలం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించింది. అయితే, ఈ ఆరోపణలపై సూర్య కానీ, అతని కార్యాలయం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

"ఆటలాడుకునే పిల్లలకు అధికారం అప్పగిస్తే ఏమవుతుందో చెప్పడానికి తేజస్వి సూర్య ఉదాహరణ. విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి చిన్నపిల్లళ్లా అల్లరి చేష్టలకు పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. ఇలా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎందుకు?" అని కర్ణాటక కాంగ్రెస్ మండిపడింది.  విమాన భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి సూర్య చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించింది.

"ఎంపీ ఉద్దేశం ఏమిటి? డిజాస్టర్ సృష్టించడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? క్షమాపణలు చెప్పిన తర్వాత అతన్ని వెనుక సీటుకు ఎందుకు మార్చారు?" అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అంతేకాదు.. టేకాఫ్ తర్వాత ఈ "చిలిపి పని" జరిగితే.. జరగబోయే ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు.  "దీనిని ఎందుకు విచారించడం లేదు?" అని నిలదీసింది.

 

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగరా.. నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

ఆ రోజు తిరుచిరాపల్లికి వెళ్లే ముందు విమానం అన్నిరకాల ఇంజనీరింగ్ తనిఖీలు చేయబడింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డిజీసీఏలోని సీనియర్ అధికారి మంగళవారం మాట్లాడుతూ, జరిగిన ఘటన సరిగ్గా నివేదించబడిందని, భద్రతలో ఎటువంటి రాజీ పడలేదని చెప్పారు.

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ దీని మీద మాట్లాడుతూ.. ‘సురక్షితమైన టేకాఫ్, ల్యాండింగ్ కోసం, ఎల్లప్పుడూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లండి' అని అన్నారు. ఏఐసీసీ కర్ణాటక ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, "బీజేపీ వీఐపీ ఆకతాయిలు! ఎయిర్‌లైన్‌కు ఫిర్యాదు చేయడం ఎంత ధైర్యం? బీజేపీ అధికార ప్రముఖులకు ఇది ఆనవాయితీగా మారిందా? ప్రయాణీకుల భద్రతపై రాజీ పడిందా? ఓహ్! బీజేపీకి వీఐపీలు చేసే ఇలాంటి వాటి గురించి మీరు ప్రశ్నలు అడగలేరు. !

ఈ వార్తలను అణిచివేసేందుకు ఎంపీ తన పరపతిని ఉపయోగించుకున్నారా అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కెపిసిసి కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. "ఇండిగో ప్రయాణికుడి పేరు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతోంది? వారు డిజిసిఎకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఎంపీ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు.  బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇండిగో విమానం యొక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను తెరవడం వల్ల.. విమానం 2 గంటలు ఆలస్యం అయింది" అని ఆరోపించారు. 

click me!