బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నదే. రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఎకనామిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాన్ ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: కొవిడ్ కారుమేఘాలు కమ్మేసినప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెనుకపట్టు పట్టింది. ముఖ్యంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కానీ, భారత్ మాత్రం వాటిలా బలహీనపడలేదు. నష్టపోతున్నప్పటికీ పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే చాలా మెరుగ్గా ఉన్నది. ఇదే విషయాన్ని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఎకనామిక్ సర్వే 2022-23ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) వృద్ధి రేటు 7 శాతంగా ప్రొజెక్ట్ చేసింది. అంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తక్కువగానే ఉంటుందని అంచనా కట్టింది. అదే గత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండటం గమనార్హం.
వచ్చే ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ ఇది గొప్ప విషయమే. ఎందుకంటే.. ప్రపంచంలోని దిగ్గజ ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు ఇంతలా లేదు. కాబట్టి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నిలిచింది. ఈ జీడీపీ వృద్ధి ఇది వరకే ఆర్థిక నిపుణులు అంచనా వేసినదానికి అటూ ఇటూగానే ఉన్నది.
వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీ, ఆర్‌బీఐల అంచనాలకు దగ్గరగానే ఎకనామిక్ సర్వే అంచనా ఉన్నది.
అయితే, వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.8 శాతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎకనామిక్ సర్వే తెలిపింది. ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, కీలక నిర్ణయాల వల్ల ఇలా అంచనా వేసుకోవచ్చని వివరించింది.
ఆర్థిక వృద్ధి రేటును 6 శాతం నుంచి 6.8 శాతంగా అంచనా కట్టడానికి.. కరోనాతో సతమతం అయిన మిగతా ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌కు కొన్ని ఎక్కువ అనుకూలతలులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నది.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో సంక్షోభ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతలకు పాల్పడుతుండటంతో ఈ సంక్షోభ సంకేతాలు బలంగా ప్రజల్లో కనిపిస్తున్నాయి. ఫలితంగా భారత్‌లోకి ఎక్కువ డబ్బు ప్రవాహం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, భారత ద్రవ్యోల్బణం 6 శాతం లోపే ఉంటుందని ఎఖనామిక్ సర్వే తెలిపింది.