
Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విదేశాంగ విధాన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. విదేశాంగ విధాన విషయంలో కేంద్రం చేసిన వ్యూహాత్మక తప్పిదమే చైనా, పాకిస్థాన్‌లను ఏకతాటిపైకి తెచ్చిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.
వివరాల్లోకెళ్తే.. బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. చైనా, పాకిస్థాన్‌లను భారత్ దూరంగా ఉంచాలని హితవు పలికారు. కానీ ఆ పని చేయడంలో భారత్ విఫలమైందని... జమ్మూ కాశ్మీర్ (jammu and kashmir) వల్ల చైనా (china), పాకిస్థాన్‌లు (pakistan) దగ్గరయ్యాయని రాహుల్ అన్నారు. ఇది వ్యూహాత్మక తప్పిదమన్న ఆయన తన ప్రసంగంలో కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 (article 370) రద్దు గురించి కూడా ప్రస్తావించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అంటూ దుయ్యబట్టారు. అదే సమయంలో ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విదేశీ అతిథులు ఎవరూ హాజరుకాలేదంటూ రాహుల్ కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. ఎందుకంటే భారత్.. ప్రస్తుతం పొరుగు దేశాల నుండి పూర్తిగా ఒంటరయ్యిందని వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్థాన్‌లు తమ ఆయుధాల నిల్వలను పెంచుకుంటున్నాయని రాహుల్ గుర్తుచేశారు.
ఇక రాహుల్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. చైనా, పాకిస్థాన్‌లను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పార్టీ బీజేపీ నేతలతో పాటు కేంద్ర మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా సరైనవి కావని ఆయన అన్నారు. చైనా, పాకిస్థాన్ లు చాలా కాలం నుంచి మిత్రదేశాలుగా ఉన్నాయని తెలిపారు. 1960 నుంచే ఆ రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. అలాగే, విదేశాంగ విధానం.. పాక్, చైనా సంబంధాలు గురించి రాహుల్ గాంధీ ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరూ తిప్పికొట్టలేదని పేర్కొన్న నట్వర్ సింగ్.. ఈ అంశం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు.
అలాగే, జమ్మూకాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకెళ్లిన సమయం నుంచి చైనా, పాకిస్థాన్ దేశాలు కలిసిమెలిసి ఉంటున్నాయని నట్వర్ సింగ్ అన్నారు. ఇదిలావుండగా, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ నుండి ఎన్నికల సంఘం వరకు ప్రతి సంస్థపై దాడి చేశారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే.. వారి గొంతును అణిచివేసేందుకు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లను ప్రభుత్వ సాధనాలు మార్చుకుందని అన్నారు.