ఐదేళ్లలో ‘రక్షణ’ ఎగుమతులు 334 శాతం పెరిగాయి: కేంద్రం

By Mahesh KFirst Published Sep 25, 2022, 7:55 PM IST
Highlights

భారత్ రక్షణ రంగ ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు 334 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, రక్షణ రంగ ఉత్పత్తుల్లో దేశీయంగానూ మంచి అభివృద్ధి సాధించిందని వివరించింది.
 

న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు 334 శాతం మేరకు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పరస్పర సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారా భారత్ ఇప్పుడు సుమారు 75 దేశాలకు ఈ రక్షణ ఎగుమతులు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయాన్ని ఓ ట్వీట్‌లో వెల్లడించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద భద్రతా బలగాలు కలిగిన భారత డిఫెన్స్ రంగం ప్రస్తుతం కీలక మూలమలుపులో ఉన్నదని తెలిపింది.

గత ఐదేళ్లలో డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్‌లో 334 శాతం పెరుగుదల కనిపించిందని వివరించింది. కలిసి పని చేయడం ద్వారా భారత్ ఇప్పుడు సుమారు 75 దేశాలకు రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేస్తున్నదని పేర్కొంది. ఆ ట్వీట్‌కు అటాచ్ చేసిన పోస్టర్‌లో కీలక విషయాలను వెల్లడించింది.

ఈ పెరుగుదలలో దేశీయంగా రక్షణ రంగంలో గొప్ప అభివృద్ధి జరిగిందని, అలాగే, డిఫెన్స్ సెక్టార్ కూడా అనూహ్యంగా మందడుగు అవేసిందని పీఐబీ తెలిపింది. అంతేకాదు, ఇటీవలే రక్షణ రంగం చేపట్టిన కీలక ప్రాజెక్ట‌లను వివరించింది.

భారత్ దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కొచ్చిలో జలప్రవేశం చేయడాన్ని ఈ సందర్భంగా పీఐబీ ప్రస్తావించింది.

అంతేకాదు, దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ఎంకే - 3 ను ఇండియన్ కోస్ట్ గార్డ్ సేవల్లోకి తీసుకోవడం, న్యూక్లియర్ మోసుకెళ్లే సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్ అగ్ని పీ కొత్త జెనరేషన్‌ ను విజయవంతంగా పరీక్షించడాన్ని కూడా పేర్కొంది.

గురువారం జరిగిన ఓ సమావేశంలో డిఫెన్స్ సెక్రెటరీ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మేక్ ఇన్ ఇండియా శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గత 75 ఏళ్ల కాలంలో భారత్ డిఫెన్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాల్లో ఒకటిగా ఉండేది. ఈ స్థితి నుంచి భారత్‌ ను ఎగుమతిదారుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన చెప్పారు.

click me!