కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో లాలూ , నితీశ్ కుమార్ భేటీ.. జాతీయ స్థాయిలో ఆసక్తి

By Siva KodatiFirst Published Sep 25, 2022, 6:45 PM IST
Highlights

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విపక్షాల ఐక్యతే లక్ష్యంగా నితీశ్ - లాలూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 

ఢిల్లీలో సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, విపక్షాల ఐక్యతపై ఈ భేటీలో వీరిద్దరు చర్చించనున్నారు. అంతకుముందు ఆదివారం హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఐఎన్ఎల్డీ నేతృత్వంలో విపక్షాల ఐక్యతా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా , బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, శివసేన నేత అరవింద్ సావిత్ సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ తప్పుడు వాదనలు, వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ పెద్ద అబ‌ద్దాల పార్టీ అంటూ మండిప‌డ్డారు. బీహార్ లోని పూర్ణియాలో విమానాశ్రయం గురించి హోంమంత్రి అమిత్ షా ఇటీవల జరిగిన బహిరంగ సభలో మాట్లాడారనీ, నగరంలో విమానాశ్రయం లేనప్పటికీ అక్కడ మాట్లాడారని ఆయన విమ‌ర్శించారు. 

Also REad:బీజేపీ పెద్ద అబద్ధాల పార్టీ.. మోడీ స‌ర్కారుపై తేజ‌శ్వీ యాద‌వ్ తీవ్ర విమ‌ర్శ‌లు

అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేసేందుకు పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని తెలిపారు. హిందువులు-ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని పేర్కొన్న ఆయ‌న‌.. అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. "జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే నా కోరిక.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలి" అని అన్నారు.
 

click me!