icc world cup 2023 : ఐసీసీ క్రెకెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు యువకులు బలవన్మరణానికి ఒడిగట్టారు. ఇందులో ఒకరు పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా.. మరొకరు ఒడిశాకు చెందిన వ్యక్తి. మ్యాచ్ ముగిసిన కొంత సమయానికే వీరిద్దరూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
icc world cup 2023 : గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు రోజుల కిందట ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియాతో భారత్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం చెందింది. దీనిని యావత్ భారతదేశం జీర్ణించుకోలేకపోయింది. అయితే భారత్ ఓటమితో మనస్థాపం చెందిన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లా బెలియటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సినిమా హాల్ వద్ద 23 ఏళ్ల రాహుల్ లోహర్ అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన కొంత సమయం తరువాత ఇంట్లోని తన గదిలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.
అలాగే ఒడిశాలోని జాజ్ పూర్ కు కు చెందిన 23 ఏళ్ల దేవ్ రంజన్ దాస్ ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే తన ఇంటి మేడపై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ యువకుడు ఎమోషనల్ డిజార్డర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడని, దాని కోసం చికిత్స కూడా పొందుతున్నాడని మేనమామ పోలీసులకు తెలిపారు. ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో నిరాశతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా.. దేవ్ రంజన్ దాస్ మృతిపై తాము అసహజ మరణం కింద కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని జరీ ఔట్ పోస్టు ఇన్ చార్జి ఇంద్రమణి జువాంగా తెలిపారు. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 19) జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.