
PM Modi unveils Gandhi statue in Hiroshima: జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ట్విటర్ లో షేర్ చేస్తూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. "హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హిరోషిమాలోని ఈ విగ్రహం చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. శాంతి, సామరస్యం అనే గాంధేయ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తాయి. మిలియన్ల మందికి బలాన్ని ఇస్తాయి" అని ప్రధాని మోడీ జపాన్ భాషలో ట్వీట్ చేశారు.
కాగా, జీ-7 కూటమి వార్షిక సదస్సు, మూడో వ్యక్తిగత క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్ లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు.ఈ సమావేశంలో ప్రపంచ నాయకులతో ప్రపంచ సవాళ్లపై అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు వాటిని సమిష్టిగా పరిష్కరించే మార్గాలపై చర్చించనున్నారు. శనివారం జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో సమావేశమైన ప్రధాని ఆ తర్వాత హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జపాన్ ప్రధానితో మోడీ భేటీ సందర్భంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి సహా వివిధ రంగాల్లో భారత్-జపాన్ మైత్రిని పెంపొందించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.
మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జరిపిన అణుదాడిలో దాదాపు 1,40,000 మందిని పొట్టనపెట్టుకున్న 'హిరోషిమా' అనే పదం వింటే నేటికీ ప్రపంచం భయపడిపోతుందని అన్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్ వెళ్లినప్పుడు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించింది. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల అహింసా భావన ముందుకు వెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు.
'జపాన్ ప్రధానికి నేను బహుమతిగా ఇచ్చిన బోధి చెట్టును హిరోషిమాలో నాటడం నాకు గొప్ప క్షణం, తద్వారా ప్రజలు ఇక్కడకు వచ్చినప్పుడు శాంతి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్నా' అని మోడీ పేర్కొన్నారు. హిరోషిమా మానవ చరిత్రలో అణ్వాయుధంతో దాడి జరిగిన ప్రదేశం. ఆగస్టు 6, 1945 న, హిరోషిమా ప్రపంచంలోని మొదటి అణు దాడిని ఎదుర్కొవడంతో దాదాపు 140,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించలేని ఆస్తి నష్టాన్ని కలిగించింది. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9 న, యునైటెడ్ స్టేట్స్ నాగసాకి నగరంపై "ఫ్యాట్ మ్యాన్" అనే మరొక బాంబును వేసింది, దీనిలో 75,000 మందికి పైగా మరణించారు. యుద్ధకాలంలో అణుబాంబులను ఉపయోగించిన సంఘటనలు ఈ రెండు మాత్రమే మానవ చరిత్రలో ఉన్నాయి.