ప్రపంచంలోనే హై పాపులారిటీ లీడర్.. ప్రధాని నరేంద్ర మోడీ.. వెల్లడించిన అమెరికన్ సర్వే

By telugu teamFirst Published Sep 4, 2021, 9:38 PM IST
Highlights

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే మరే నేతకు లేనంత క్రేజ్ ఉన్నది. వయోజనుల్లో 70శాతం  ఆమోదం ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా మిగతా నేతలందరూ ఆయన వెనకే ఉండిపోయారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ గల నేతల్లో ఆయన టాప్‌లో నిలిచారు. ఆయన దరిదాపుల్లో ఇంకో నేత లేనేలేరు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కూడా మోడీకున్న క్రేజ్ ముందు దిగదుడుపే అయ్యారు. అమెరికన్ సర్వే వెల్లడించిన సంచలన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వయోజనుల్లో 70శాతం క్రేజ్ ఇంకా ఉన్నది. ఆయన నాయకత్వంపై ఇప్పటికీ ఆమోదమే ఉన్నది. కాగా, రెండో స్థానంలో మెక్సికో ప్రెసిడెంట్ లోపెజ్ ఒబ్రడార్ ఉన్నారు. ఆయనకు వయోజనులలో 64శాతం ఫాలోయింగ్ ఉన్నది. కాగా, తర్వాతి స్థానాల్లో ఇటలీ ప్రధానమంత్రి మేరియో ద్రాఘి(63శాతం), జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్(52శాతం), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(48శాతం), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్(48శాతం), కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(45శాతం), ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్(41శాతం), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో(39శాతం), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయిన్(38శాతం), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్(35శాతం), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్(34శాతం), జపాన్ ప్రధాని యోషిహిదె సుగా(25శాతం)లకు  అడల్ట్ పాపులేషన్‌లో ఆమోదం ఉన్నది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వ విధానాలు, పథకాలకు లభిస్తున్న స్పందనగా ఈ రేటింగ్‌ను  చూడవచ్చు. 70శాతం మందిలో ప్రధాని మోడీకి ఆమోదరేటింగ్ ఉండటం సంచలనంగా పేర్కొంటున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి ఇమేజ్ డ్యామేజీ అయినట్టు తెలుస్తున్నది.

అమెరికాలో ప్రముఖ రీసెర్చ్ ఆధారిత సర్వేలు చేసే మార్నింగ్ కన్సల్ట్ ఈ రేటింగ్ వెలువరించింది. ఇది  ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రాజకీయంగా మారుతున్న ధోరణులను అంచనా వేయడానికి పనిచేస్తుంది. మొత్తం 13 దేశాలకు వారం వారీగా ఆయా దేశాల  ప్రభుత్వాధినేతలకు యువతలో ఉన్న ఆమోదాన్ని సర్వే చేస్తుంది. వారం రోజుల సగటుతో ఈ అంచనాలు విడుదల చేస్తుంది. దేశాలను బట్టి నమూనా స్థాయీ ఉంటుంది. భారత్ సహా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా,
స్పెయిన్, యూకే, యూఎస్‌లపై మార్నింగ్ కన్సల్ట్ ప్రతివారం సర్వే విడుదల చేస్తుంది.

click me!