New Delhi: ఖతార్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మాజీ నేవీ అధికారుల కుటుంబాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పరామర్శించారు. కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఆయన, ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉద్ఘాటించారు.
Indian Navy chief Admiral R. Hari Kumar: గూఢచర్యం ఆరోపణలపై ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ నావికాదళ సిబ్బందిని విడిపించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో అరెస్టయ్యే ముందు ఈ ఎనిమిది మంది గల్ఫ్ దేశాల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్టోబర్ 26న ఉరిశిక్ష అక్కడి కోర్టు ఖరారు చేసింది. గోవా మారిటైమ్ కాంక్లేవ్ సందర్భంగా అడ్మిరల్ హరి కుమార్ మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు వివరాలను ఆదివారం ఇవ్వాల్సి ఉందనీ, కానీ ఇంతవరకు అలా జరగలేదని అన్నారు.
తీర్పును అధ్యయనం చేస్తే వారిపై ఉన్న అభియోగాలను అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి సహాయం చేయడానికి, వారి స్వేచ్ఛను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని నేవీ చీఫ్ పునరుద్ఘాటించారు. అంతకు ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం ఎనిమిది మంది మాజీ సైనికుల కుటుంబాలను పరామర్శించారు. 'ఖతార్ లో నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని' నొక్కి చెప్పారు.
undefined
భారత మాజీ నేవీ అధికారుల విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆ విషయంలో కుటుంబాలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. కాగా, గత ఏడాది అరెస్టయిన ఎనిమిది మంది భారతీయులకు ముందువారంలో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై అసంతృప్తిని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఎంఈఏ, ప్రభుత్వం అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తోందని తెలిపింది. ఖతార్ లోని డిఫెన్స్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది రిటైర్డ్ ఇండియన్ నేవీ సిబ్బందిని అక్కడి అధికారులు 2022లో అదుపులోకి తీసుకున్నారు.
అప్పటి నుంచి ఖతార్ అధికారులు నిర్బంధానికి గల కారణాన్ని పేర్కొనకుండా వారిని ఏకాంత నిర్బంధంలో ఉంచారు. గతవారంలోనే వారికి ఖతార్ కోర్టు మరణశిక్షను విధించింది. మరణశిక్షను ఎదుర్కొనబోయే వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ లు ఉన్నారు. వీరిని దోహాలో ఖతార్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అరెస్టు చేసింది.