లక్షద్వీప్‌పై ప్రపంచ పర్యాటకుల దృష్టి.. ఎయిర్‌పోర్ట్ కట్టే ప్లాన్‌లో భారత ప్రభుత్వం

By Siva Kodati  |  First Published Jan 9, 2024, 5:45 PM IST

లక్షద్వీప్‌ను భారతదేశం పర్యాటకం కోసం ప్రోత్సహించాలని చూస్తోంది. దీనిలో భాగంగా మినీకాయ్ దీవులలో వాణిజ్య విమానాలతో పాటు యుద్ధ విమానాలతో సహా మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేసేలా కొత్త ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది


భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు , ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా లక్షద్వీప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంటర్‌నెట్ టాప్ సెర్చింగ్స్‌లో లక్షద్వీప్ ఒకటిగా మారింది. అటు భారతీయులు సైతం మాల్దీవ్స్‌కు బుద్ధి చెప్పాలని, హాలిడే వెకేషన్ కోసం ఆ దేశానికి వెళ్లకుండా లక్షద్వీప్‌ను ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నారు. 

మరోవైపు.. లక్షద్వీప్‌ను భారతదేశం పర్యాటకం కోసం ప్రోత్సహించాలని చూస్తోంది. దీనిలో భాగంగా మినీకాయ్ దీవులలో వాణిజ్య విమానాలతో పాటు యుద్ధ విమానాలతో సహా మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేసేలా కొత్త ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఫైటర్ జెట్‌లు, మిలటరీ రవాణా విమానాలు, వాణిజ్య విమానాలను ఆపరేట్ చేయగల ఉమ్మడి ఎయిర్‌ఫీల్డ్‌ను కలిగి వుండాలనేది ప్రణాళిక అని ప్రభుత్వ వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. 

Latest Videos

మినీకాయ్ దీవులలో కొత్త ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయడానికి గతంలోనూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినప్పటికీ .. జాయింట్ యూజ్డ్ డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్‌ని కలిగి వుండాలనే ఆలోచన రేకెత్తింది. సైనిక దృక్కోణంలో .. ఈ ఎయిర్‌ఫీల్డ్ భారతదేశానికి బలమైన సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇది అరేబియా సముద్రం, హిందూ మహా సముద్ర ప్రాంతంపై నిఘా వేయడానికి ఒక స్థావరంలా ఉపయోగించవచ్చు. మినీకాయ్ దీవులలో ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేయాలని సూచించిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తొలి దళం ఇండియన్ కోస్ట్ గార్డ్. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం.. మినికాయ్ నుంచి కార్యకలాపాలను నిర్వహించడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందంజలో వుంది. 

మినికాయ్‌లోని విమానాశ్రయం రక్షణ దళాలకు అరేబియా సముద్రంలోని తమ నిఘా ప్రాంతాన్ని విస్తరించే సామర్ధ్యాన్ని కూడా అందిస్తుంది. మినికాయ్‌లోని విమానాశ్రయం ప్రభుత్వంచే ప్రణాళిక చేయబడినట్లుగా ఈ ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఒకే ఒక ఎయిర్‌స్ట్రిప్ వుంది. అది కూడా అగట్టిలో.. అయితే ఇక్కడ విమాన రాకపోకలు పరిమితం. కొత్త విమానాశ్రయం అభివృద్ధి, ప్రస్తుత సౌకర్యాలను పొడిగించే ప్రతిపాదన ఇటీవల పట్టాలెక్కింది. 

గత వారం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించినప్పటి నుంచి ఈ లక్షద్వీప్ చర్చనీయాంశంగా మారింది. మాల్దీవుల పాలక పక్షానికి చెందిన రాజకీయ నాకులు.. లక్షద్వీప్‌ను పర్యాటక ప్రదేశంగా ప్రమోట్ చేస్తున్న భారత ప్రణాళికలను విమర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. 

click me!