క్యూనెట్‌పై కేంద్రం కన్నెర్ర: పెట్టుబడులు పెట్టొద్దంటూ ప్రకటన

By Siva KodatiFirst Published Aug 27, 2019, 9:29 AM IST
Highlights

క్యూనెట్ కంపెనీ మోసాలపై కేంద్రప్రభుత్వం కన్నెర్ర చేసింది. క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టొద్దంటూ కేంద్రం ప్రకటన చేసింది. ఈ కంపెనీ విహాన్‌లో అన్ని అక్రమాలేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిర్థారించింది. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ చీటింగ్‌కు పాల్పడిందని తెలిపింది

క్యూనెట్ కంపెనీ మోసాలపై కేంద్రప్రభుత్వం కన్నెర్ర చేసింది. క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టొద్దంటూ కేంద్రం ప్రకటన చేసింది. ఈ కంపెనీ విహాన్‌లో అన్ని అక్రమాలేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిర్థారించింది.

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ చీటింగ్‌కు పాల్పడిందని తెలిపింది. అధిక రాబడులు, విలాసాలను ఆశ చూపి ప్రజలను భ్రమల్లోకి నెట్టి.. క్యూనెట్ భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించింది.

చైన్  మార్కెటింగ్‌తో వేల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేసింది. క్యూనెట్‌పై హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ మోసాన్ని తట్టుకోలేక అనేకమంది బలన్మరణాలకు సైతం పాల్పడ్డారు.

దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పరచుకుని మోసానికి పాల్పడింది క్యూనెట్.. హంకాంగ్ కేంద్రంగా ప్రారంభమైన ఈ కంపెనీ భారత్‌లో వేగంగా విస్తరించింది. క్యూనెట్‌లో పెట్టుబడులు పెడితే.. అతి కొద్దికాలంలో కోట్లాది రూపాయలు సంపాదించవచ్చని.. విదేశాల్లో విహరించవచ్చని ప్రలోభాలకు గురిచేసి.. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు బుట్టలో వేసుకుంది.

క్యూనెట్ ప్రతినిధుల తియ్యటి మాటలను నమ్మి ఎంతోమంది అమాయకులు అందులో పెట్టుబడులు పెట్టారు. తిరిగి డబ్బులు రావాలంటే మరికొంతమందిని చేర్చాలని కంపెనీ నిబంధన విధించి.. దేశమంతా మల్టీలెవల్ మార్కెట్‌ను విస్తరించింది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, బ్యాంక్ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను క్యూనెట్‌ టార్గెట్ చేసింది. ఈ చైన్ మార్కెట్‌లో తాము పెట్టుబడులు పెట్టడమే కాకుండా తమ వారితో పెట్టుబడులు పెట్టించి.. లక్షలాది రూపాయలు మోసపోయారు జనం.

సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు క్యూనెట్ సంస్థకు ప్రచారకర్తలుగా వ్యవహరించడంతో కేసుల్లో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ఆర్ధిక అలజడుల్లోకి నెట్టిన క్యూనెట్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం మంచి పరిణామం అంటున్నారు బాధితులు. 

click me!