కాశ్మీర్ పై బిజెపి పక్కా ప్లాన్: దేశ ప్రజల ర్యాలీ పాయింట్ అదే

Published : Aug 26, 2019, 08:31 PM IST
కాశ్మీర్ పై బిజెపి పక్కా ప్లాన్: దేశ ప్రజల ర్యాలీ పాయింట్ అదే

సారాంశం

ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఎను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు బిజెపి భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతోంది. నెల పాటు ప్రజలకు ఆ విషయాన్ని వివరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ అస్త్రాన్ని బిజెపి దేశవ్యాప్తంగా ప్రయోగించనుంది. ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఎను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు బిజెపి భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతోంది. నెల పాటు ప్రజలకు ఆ విషయాన్ని వివరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. 

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తన కార్యక్రమాన్ని చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 35 మెగా ర్యాలీలను, 370 సభలను నిర్వహించనుంది. ప్రథమ శ్రేణి నగరాల్లోనూ ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ చిన్నపాటి సభలను నిర్వహించాలని బిజెపి తలపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది. 

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా, సోపోర్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో బిజెపి ఆ కార్యక్రమాలను చేపట్టనుంది. ఆర్టికల్ 370 రద్దు అనేది చారిత్రాత్మక నిర్ణయమని, జిల్లా స్థాయి నుంచి నగరాల వరకు ప్రజలకు దాని గురించి వివరిస్తామని, అది ప్రజలకు చేసే మంచి గురించి చెప్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంటున్నారు. 

మాస్ కాంటాక్ట్ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, బిజెపి ఆఫీస్ బియరర్లు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు వారి బాధ్యతలను కూడా తెలియజేస్తామని అన్నారు. మాస్ కాంటాక్ట్ కార్యక్రమం రెండు దశల్లో ఉంటుంది. 

తొలి దశలో 35 నగరాల్లో ర్యాలీలు ఉంటాయి. వీటిలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ కేంద్ర నాయకులు, సీనియర్ నేతలు పాల్గొంటారు రెండో దశలో 370 సభలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఏడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ రూపకల్పనకు పార్టీ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు