
సామాజిక మాధ్యమాలు (social media) , వీడియో ప్లాట్‌ఫాంలలో (video platforms) అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గతేడాది ఓటీటీలు, సోషల్ మీడియా సంస్థలకు నియామవళి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 22 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై (youtube channels) నిషేధం విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్ (pakistan) కేంద్రంగా నడిచేవి ఉన్నాయి. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ పేర్కొంది. అయితే భారత్, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మనదేశంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. న్యూస్ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్‌నెయిల్‌లు వాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తేల్చింది. వీటితోపాటు భారత భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్ అంశాలతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ తెలియజేసింది.
కాగా.. నిషేధం విధించిన ఈ యూట్యూబ్ ఛానెళ్ల మొత్తం వీక్షణల సంఖ్య 260 కోట్లుగా ఉన్నట్లుగా తెలిపింది. ఇవి అవాస్తవ సమాచారం వైరల్‌గా మారేందుకు ఇమేజ్‌లు, టైటిళ్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు గుర్తించింది. పాకిస్థాన్ ఛానెళ్లు కూడా ఇదే విధంగా భారత్‌కు వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ సమగ్రత, జాతీయ భద్రత విషయాల్లో ప్రజలను తప్పుదోవపట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో విశ్వసనీయమైన, ప్రామాణిక వార్తల ప్రసారాలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది.