లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయం మీదున్న జెండాను దించి దుశ్చర్యకు పాల్పడ్డారు ఖలిస్తాన్ వేర్పాటువాదులు. అయితే భద్రతావైఫల్యం మీద భారత్ మండిపడింది. ఇక్కడి దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ : లండన్ లో ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత హై కమిషన్ బిల్డింగ్ పై ఉన్న జాతీయ జెండాను కిందికి దించారు. అలా జెండాను అగౌర పరచడం మీద భారత్ మండిపడింది. ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు ఈమెరకు భారత్ సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు లండన్ లో చేసిన పనిని మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపింది. అక్కడి ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అనుచరులను రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్లో రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం లండన్లో ప్రవాస సిక్కుల్లోని ఓవర్గం నిరసనలు ప్రారంభించింది. లండన్ లో ఉన్న భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది. దీనిమీద భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఖలిస్థానీ నిరసనకారులు హై కమిషన్ వరకు వచ్చేంతవరకు.. అక్కడ ఇలాంటి చర్యకు పాల్పడే వరకు అక్కడి భద్రత సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
ఖలిస్తాన్ నాయకుడు అమృత్‌పాల్ కోసం పోలీసుల వేట.. ప్రభుత్వానికి సిక్కు సంఘాల హెచ్చరికలు
ఈ చర్య మీద వెంటనే కూలంకషంగా వివరణ ఇవ్వాలని భారత్ బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత హై కమిషన్కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని.. ఇది వియన్నా ఒప్పందం ప్రకారం ఉన్న విషయమని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది. లండన్ లోని భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం.. అక్కడున్న భారత సిబ్బంది భద్రత మీద యూకే ప్రభుత్వం ఇలా ఉదాసీనత చూపించడం.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ తెలిపింది.