మరికొన్ని సంవత్సరాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: అమిత్ షా

By Mahesh KFirst Published Sep 13, 2022, 2:12 AM IST
Highlights

భారత్ మరికొన్ని సంవత్సారల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, అందులో తనకు సందేహమేమీ లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కోఆపరేటివ్ సెక్టార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని వివరించారు. 
 

న్యూఢిల్లీ: కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కోఆపరేటివ్ సెక్టార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని వివరించారు.

2024 ఎన్నికలకు ముందు గ్రామస్థాయిలో కొత్తగా 2 లక్షల కొత్త డెయిరీ కోఆపరేటివ్‌లను స్థాపించడానికి ప్రభుత్వం సహకరిస్తుందని అమిత్ షా ప్రకటించారు. డెయిరీ పరిశ్రమ ప్రొఫెషనలిజం, నూతన సాంకేతికత, కంప్యూటరైజేషన్, డిజిటల్ పేమెంట్‌ వంటి అధునాతన విధానాలను అవలంభించాలని సూచించారు. తద్వార భావి పురోగతికి అనుగుణంగా సాగవచ్చని తెలిపారు.

దేశీ డిమాండ్, పేద దేశాలకు సప్లై చేయడానికి సరిపడా పాల ఉత్పత్తులు పెంచాలని డెయిరీ పరిశ్రమకు పిలుపు ఇచ్చారు.

గ్రేటర్ నోయిడాలో ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022 కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు.

2014 కంటే ముందు భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నదని, ఇప్పుడు మన దేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగతి సాధించిందని ఆయన వివరించారు. మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తనకు ప్రగాఢ విశ్వాసం ఉన్నదని తెలిపారు. దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత అప్పుడు తప్పకుండా కోఆపరేటివ్ సెక్టార్ గురించి చర్చిస్తారని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధత సాధించిందని, ఎగుమతిదారుగానూ పరిణమించిందని వివరించారు. డెయిరీ కోఆపరేటివ్‌లు మహిళా సాధికారతకు, పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడానికి దోహదపడుతున్నదని అన్నారు.

click me!